
గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంతో అంతర్జాతీయ క్రూడ్ వ్యాపారంలో ఒక హై-వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. ఇరాన్ నుంచి చమురుతో భారత్‌కు బయలుదేరిన ఒక భారీ ట్యాంకర్.. అనూహ్యంగా తన మార్గాన్ని మార్చుకుని చైనా వైపు మళ్లడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘పింగ్ షున్’ అనే పేరున్న ట్యాంకర్ ఏప్రిల్ 4న భారత పశ్చిమ తీరంలోని వాడినార్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ షిప్ తన గమ్యాన్ని చైనాలోని డాంగ్యింగ్‌కు మారుస్తూ సిగ్నల్స్ ఇవ్వటం ఆసక్తిగా మారింది.
ఈ క్రూడ్ షిప్ మళ్లింపు వెనుక అనేక భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న ఈ ట్యాంకర్, ఎస్వాటినీ జెండాతో ప్రయాణిస్తోంది. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ధరల్లో వ్యత్యాసాలు, ఇన్సూరెన్స్ సమస్యలు, అంతర్జాతీయ సముద్ర ప్రోటోకాల్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లలో లోపాల వల్ల ఈ మార్పు జరిగి ఉండవచ్చని సమాచారం. ముఖ్యంగా ఈ నౌకను చైనాకు చెందిన ఒక సంస్థ నిర్వహిస్తుండటం గమనార్హం. గతంలో ఇరాన్ నుంచి లోడ్ చేసుకున్న చమురును విక్రయించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమతించినప్పటికీ.. ఈ ట్యాంకర్ భారత్‌కు రాకుండా చైనా వైపు వెళ్లడం వెనుక రహస్య ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
భారత్ తన చమురు అవసరాల కోసం దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులోనూ ఎక్కువ శాతం సప్లై హోర్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఫిబ్రవరి 28 నుంచి ఈ ప్రాంతంలో మొదలైన యుద్ధం కారణంగా క్రూడ్ రవాణా తీవ్రంగా దెబ్బతింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు రావాల్సిన ట్యాంకర్ దారి మళ్లడం ఇంధన భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. భారత్ అభ్యర్థించినా దక్కని ఈ చమురును చైనా చేజిక్కించుకోవడం వెనుక డ్రాగన్ దేశ దౌత్య వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.