Reading Time: < 1 minute
Sajjala Ramakrishna Reddy Clarifies Ysrcp Stand On Capital Criticizes Amaravati Plan

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో పాలక, ప్రతిపక్షాల మాట యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, రాజధాని విషయంలో తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. అయితే, అమరావతి పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాశ్వతంగా దోపిడీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తూ మెగా సిటీగా తీర్చిదిద్దాలనే ఆలోచనను వివరించారు.

Read Also: Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..

తక్కువ ఖర్చుతో రియల్ క్యాపిటల్ సాధ్యమవుతుందని, అమరావతి ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడుతోందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇక, తిరుమల అంశంపై కూడా ఆయన స్పందించారు. తిరుమల పవిత్రత రోజురోజుకీ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

మరోవైపు, పార్టీ బలోపేతంపై మాట్లాడుతూ, కమిటీల నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని తెలిపారు సజ్జల. మొత్తం 18 లక్షల క్రియాశీల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 13 లక్షల సభ్యుల డేటా సేకరించినట్లు చెప్పారు. త్వరలో సభ్యులకు ఐడీ కార్డుల ముద్రణ, పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా గ్రామస్థాయిలో ప్రచారాన్ని మరింత పెంచాలని, ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. బీఎల్‌వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని, కొత్త ఓటర్ల నమోదు జాగ్రత్తగా చేపట్టాలని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి..