
కథ: వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ (శర్వానంద్) హైదరాబాద్ లో ఒక కార్టింగ్ జోన్ నడుపుతూ భార్య అనన్య (మాళవిక నాయర్), కొడుకు ఇషాన్ తో కలిసి జీవిస్తుంటాడు. సాధారణ జీవితం గడుపుతున్న అతను.. గతంలో ఒక గొప్ప బైక్ రేసర్. అనివార్య కారణాల వల్ల రేసింగ్ విడిచిపెట్టి మామూలుగా బతికేస్తుంటాడు. అయితే రేసింగ్ కోచ్ అయిన అతడి తండ్రి సునీల్ నారాయణ్.. తాను పని చేసే కార్పొరేట్ సంస్థ చేతిలో దారుణంగా దెబ్బ తిని మీడియాలో మోసగాడిగా ముద్ర వేయించుకున్న సంగతి తెలిసి వికాస్.. తాను తిరిగి రేసర్ గా మారాలనుకుంటాడు. ఇంతకీ సునీల్ మీద అలాంటి ముద్ర పడడానికి కారణాలేంటి.. వికాస్ రేసింగ్ ఎందుకు వదిలేశాడు.. గతంలో వీరి మధ్య ఏం జరిగింది.. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ బైక్ రేసింగ్ లోకి వెళ్లిన విక్కీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. అతను అనుకున్నది సాధించాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ: కొంతకాలం క్రితం తెలుగులో కల్ట్ స్పోర్ట్ డ్రామాగా ‘జెర్సీ’, ఈ మధ్య ‘ఎఫ్-1’ సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించి భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక బైకర్ సినిమా మోటోక్రాస్ రేసింగ్, తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలు నేపథ్యంలో సాగే కథ. అయితే ఈ సినిమాలో దర్శకుడు కీలకమైన భావోద్వేగాలను పండించడంలో మాత్రం సక్సెస్ కాలేక పోయాడు. హీరో ఇంట్రడక్షన్, అతని ప్లాష్ బ్యాక్, తండ్రితో బంధం, ప్రేయసితో లవ్ సీన్స్, అన్వర్‌తో రేసింగ్ కాంపిటీషన్ ఇలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇదంతా కొత్తగా ఏమీ ఉండదు. ఆతర్వాత తండ్రిపై నిందలు పడటం, అది కొడుకు తట్టుకోలేకోవడంతో సెకెండాఫ్ మొదలవుతుంది.
అయితే ‘బైకర్’లో ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని బైక్ రేసుల నేపథ్యాన్ని అభిలాష్ రెడ్డి చూపించిన తీరు ఆకట్టుకుంది. క్లైమాక్స్ రేస్ ఎపిసోడ్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఫాదర్ కమ్ కోచ్ పాత్రకు రాజశేఖర్‌ను తీసుకోవడంతో ఆ పాత్రకు ఒక కొత్తదనం వచ్చింది. కాకపోతే ఆరంభం నుంచి కథలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే ఒక అంచనా వచ్చేయడం.. కథలో మలుపులన్నీ సాధారణంగా అనిపించడం ‘బైకర్’కు ఉన్న పెద్ద మైనస్. హీరో బైక్ రేసింగ్ మానేయడం వెనుక ఉన్న కారణాన్ని ప్రభావవంతంగా చూపించలేకపోయారు. హీరో హీరోయిన్లు శర్వా, మాళవిక ట్రాక్ పండలేదు. ఈ సినిమాలో కథాపరంగా ఇంకా వైవిధ్యం చూపించగలిగి ఉంటే బైకర్ ప్రేక్షకులను మెప్పించగలిగేది. ‘ఎఫ్1’ లాంటి సినిమాలు చూసి భారీ అంచనాలతో వెళ్తే ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపర్చడం ఖాయం.