Reading Time: 4 minutes

చెత్త ఏరియా కోసం హత్య.. స్వచ్ఛ కార్మికుడిని చంపి సంచిలో మూటకట్టి మూసీలో వేసిన్రు

Caption of Image.
  • 3 నెలల కింద మేడిపల్లి పరిధిలో ఘటన..అస్తి పంజరం స్వాధీనం  
  • చెత్త సేకరణ ఏరియా గురించి గొడవే కారణం  
  • నగరంలో సాధారణమైన ‘చెత్త’ హత్యలు  
  • నెలకు రూ.లక్షలు వస్తుండడంతో..
  • ‘చెత్త సేకరణ జాబ్’​కు ఫుల్ ​డిమాండ్​
  • కట్నాల కింద అల్లుళ్లకూ రాసిస్తున్నరు ..
  • చెక్​ పెట్టే ప్రయత్నం చేయని అధికారులు

హైదరాబాద్ ​సిటీ/ మేడిపల్లి, వెలుగు: ఆదిభట్ల ప్రాంతంలో చెత్త సేకరించే ఓ స్వచ్ఛ కార్మికుడిని దారుణంగా చంపేశారు. మూడు నెలల కింద అపహరించి చంపి మూట కట్టి మూసీ నదిలో పడెయ్యగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా నిందితులు చెప్పింది విని పోలీసులు షాక్ ​అయ్యారు. చనిపోయిన వ్యక్తి చెత్త సేకరించే స్వచ్ఛ కార్మికుడని, డిమాండ్​ఉన్న ఏరియా గురించి జరిగిన గొడవనే హత్యకు కారణమని తేల్చారు. 

చెంగిచెర్ల గణేశ్​ నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన పండిపాటి బక్కయ్య అలియాస్ నాగరాజు (33), తన దగ్గరి బంధువులైన శ్రీశైలం, నరసింహతో కలిసి ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లోని కొన్ని ఏరియాల్లో చెత్త సేకరించేవాడు. ఇక్కడ ఇండ్లతో పాటు హాస్టల్స్‌‌‌‌లాంటి కమర్షియల్​ప్రాంతాలు కూడా ఉండడంతో నెలకు రూ. లక్షల్లో సంపాదించేవారు. కొన్నేండ్ల కింద ఒక ఏరియా గురించి ముగ్గురి మధ్య విభేదాలు మొదలయ్యాయి.

బక్కయ్య చూసే కొన్ని ఏరియాలను నరసింహ , శ్రీశైలానికి అప్పజెప్పి అతడు వేరే ఏరియాలను చూడడం మొదలుపెట్టాడు. అయితే, అంతకుముందు వచ్చినట్టు ఆదాయం రాకపోవడంతో మళ్లీ తన ఏరియాను తనకు ఇవ్వాలని అడిగాడు. వారు ఒప్పుకోకపోవడంతో గొడవలు మొదలయ్యాయి.బక్కయ్యను శాశ్వతంగా లేకుండా చేస్తే సమస్య ఉండదని భావించారు. గత ఏడాది డిసెంబర్ 30న మేడిపల్లి పరిధిలో డ్యూటీకి వెళ్లిన నాగరాజు అలియాస్​బక్కయ్య తిరిగి ఇంటికి రాలేదు.  

కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. జనవరి 21న బక్కయ్య బాబాయ్ శ్రీను మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నరసింహ, శ్రీశైలాన్ని అదపులోకి తీసుకొని ప్రశ్నించగా.. నాగరాజును హత్య చేసి సంచిలో మూట కట్టి కొర్రెముల – బాచారం మూసీ వంతెన సమీపంలో పడేసినట్లు ఒప్పుకున్నారు.  సంఘటనా స్థలం వద్దకు వెళ్లిన పోలీసులు ఓ సంచిలో ఉన్న ఎముకలను స్వాధీనం చేసుకుని గాంధీ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. చెత్త సేకరణ విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు దారి తీసిందని పోలీసులు పేర్కొన్నారు. 

  • ఇదే మొదటిది కాదు..

ఒకప్పుడు రౌడీ షీటర్లు, తర్వాత పొలిటీషియన్ల మధ్య ల్యాండ్ సెటిల్‌‌‌‌మెంట్ల కోసం గొడవలు జరిగేవి. ఇప్పుడు హైదరాబాద్​లో చెత్త సేకరణ దందా వ్యవహారం మాఫియా అవతరించడానికి కారణమైంది. ఏరియా నాదంటే నాదంటూ గ్రూపుల మధ్య గొడవలు జరిగి చివరకు హత్యల వరకు వెళుతున్నాయి. 4 నెలల క్రితం కేపీహెచ్ బీలో 10 ఇండ్లకు సంబంధించి చెత్త సేకరణ విషయంలోనూ ఓ కార్మికుడిని తోటి కార్మికులే హత్య చేశారు. గతనెలలో అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌మెట్‌‌‌‌లోనూ చెత్త సేకరించే కార్మికుడిని తోటి కార్మికులు చంపబోయారు. ఈ సంఘటన మరువక ముందే తాజాగా ఆదిభట్ల ఘటన జరిగింది. దీంతో అసలు స్వచ్ఛ కార్మికుల ఏరియాలకు ఇంత డిమాండ్​ఎందుకు ఉంది? ఇంటికి రూ. 100 నుంచి నుంచి రూ.200 వరకు తీసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారా? ఇందుకోసం హత్యల వరకూ పోతున్నారా ? అని నగరవాసులు షాక్‌‌‌‌కు గురవుతున్నారు.  

  • 2007కు ముందు రిక్షాల ద్వారా చెత్త సేకరణ..

2007కు ముందు ఎంసీహెచ్‌‌‌‌గా ఉన్నప్పుడు రిక్షాల ద్వారా శుభ్రక్​కార్మికులు ఇండ్ల నుంచి చెత్త సేకరించేవారు. ఇలా దాదాపు 500 మంది ఔట్ సోర్సింగ్ కింద పనిచేసేవారు. వీరంతా సైకిల్​రిక్షాల ద్వారా ఇంటింటి చెత్త సేకరించేవారు. వీరికి జీహెచ్ఎంసీ నెలకు రూ.6 వేల వేతనం ఇచ్చేది. రోజురోజుకూ జనాభా పెరుగుతుండడం, ఇండ్ల నుంచి చెత్త ఎక్కువ కావడంతో  వారి వల్ల కాలేదు. దీంతో జనం రోడ్లపై ఉన్న డస్ట్ బిన్లలో చెత్త వేసేవారు. ఇలా రోడ్లపైన చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లేది. దీనికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ ఓ నిర్ణయం తీసుకున్నా దాన్ని సరిగ్గా హ్యాండిల్​చేయలేకపోవడం వల్ల ఇప్పటి గొడవలకు పునాది పడింది.  

  • 2009లో రాంకీతో ఒప్పందం  

గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో డోర్ టు డోర్ చెత్త కలెక్షన్​నుంచి డంపింగ్‌‌‌‌ యార్డుకు తరలించి, నిర్వహణ చేపట్టేలా 2009లో రాంకీ అనే సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం చేసుకున్నది. దీని ప్రకారం ప్రతి ఇంటి నుంచి చెత్త తీసుకువెళ్లడంతోపాటు డంపింగ్​యార్డుకు తరలించే బాధ్యతను రాంకీకి అప్పగించారు. రాంకీ సంస్థ కింద స్వచ్ఛ కార్మికులు పని చేయాలని ఆదేశించారు. అయితే, 2009 నుంచి 2012 వరకు రాంకీ.. జవహర్​నగర్​డంపింగ్​యార్డు క్యాపింగ్​పనులు, దుర్వాసన రాకుండా చేసే పనులపైనే దృష్టి పెట్టింది. 2012 నుంచి ఇంటింటి చెత్త సేకరణకు సిద్ధం కాగా, కార్మికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తాము ఎన్నో ఏండ్లుగా ఇంటింటి చెత్త సేకరిస్తున్నామని.. ఇప్పుడు వచ్చి మధ్యలో మీ పెత్తనం ఏందంటూ ఎదురుతిరిగారు. ఈ గొడవలు 2015 వరకు కొనసాగాయి. 

  • జీహెచ్ఎంసీ కక్కుర్తి  

2016లో గొడవలకు పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ ఓనర్ కమ్ డ్రైవర్ అనే స్కీమ్‌‌‌‌ను తీసుకొచ్చింది. దీని కింద స్వచ్ఛ కార్మికులకు ఆటోలు ఇచ్చేందుకు డిసైడ్​అయింది. మొదటి ప్రాధాన్యత కింద సైకిల్ రిక్షాల ద్వారా చెత్తని సేకరించే వారికి ఇచ్చారు. ఆ తర్వాత చెత్త సేకరించేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారికి కూడా ఇచ్చారు. 2016లో 2,500 వాహనాలు, 2019లో మరో 2 వేల వెహికల్స్‌‌‌‌ను అందజేసింది. ఎస్సీ కార్మికుల నుంచి రూ.60 వేలు, బీసీ కార్మికుల నుంచి రూ.80 వేలు డౌన్ పేమెంట్ కింద కలెక్ట్ చేసింది. వాటి ఈఎంఐలను నెలనెలా తామే కట్టుకుంటామని చెప్పింది. 

అయితే, రాంకీ సంస్థ రోడ్లపై, షాపుల వద్ద  చెత్త సేకరిస్తుందని, కార్మికులు తాము ఇచ్చిన ఆటోలతో ఇండ్లల్లో చెత్త సేకరించాలని అప్పటి కమిషనర్​సోమేశ్​కుమార్​ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా జీతాల విషయంలో జీహెచ్ఎంసీ కక్కుర్తి పడడంతో సమస్య మొదలైంది. తాము ఆటోల కిస్తీలు కడుతున్నందున జీతాలు ఇవ్వలేమని, ఆ డబ్బులను చెత్త తీసుకునే ఇండ్ల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పింది. కానీ, ప్రతి ఇంటి నుంచి రూ.50 మాత్రమే తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

  • ఇంతింతై వటుడింతై

రూ. 50 నుంచి మొదలైన వ్యవహారం ఇప్పుడు రూ.100, 150, 200 ఇలా కొన్ని చోట్ల రూ. 300 వరకు చేరింది. ఒకవేళ డబ్బులు ఇవ్వని ఇండ్ల నుంచి చెత్తను తీసుకుపోవడం లేదు. వీళ్లు రెండు రోజులకు ఒకసారి చెత్త తీసుకుపోతారు. ఈ చెత్తలో నుంచి ఇనుము, కాపర్​, ప్లాస్టిక్​ వస్తువులను వేరు చేసి కూడా అమ్ముకుంటారు. బస్తీల్లో ఎక్కువ మంది డబ్బులు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆ ఏరియాలను ముట్టుకోవడం లేదు. కేవలం కాలనీలపైనే దృష్టి పెట్టారు. 

  • వారసత్వ ఆస్తిగా.. 

స్వచ్ఛ కార్మికుల్లో ఓ కుటుంబానికి ఒక ఏరియా ఉంటే అది వారి ఆస్తి కిందనే పరిగణిస్తారు. ఒక్కొక్కరికి సుమారు 200 ఇండ్ల నుంచి 500 ఇండ్ల వరకు ఉంటున్నాయి. తల్లిదండ్రుల తదనంతరం ఆ ఏరియా పిల్లలకు బదలాయిస్తారు. ఇందులో బల్దియా ప్రమేయం ఏ మాత్రం ఉండదు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో 6 వేల మంది స్వచ్ఛ కార్మికులు ఉండగా, ఇప్పుడు వీరి సంఖ్య 3 కమిషనరేట్ల పరిధిలో 10 వేలకు చేరింది.  ఇప్పుడు చాలా మంది స్వచ్ఛ కార్మికులు ఆదాయం పెంచుకోవడానికి రాంకీ కలెక్ట్​చేస్తున్న షాపుల నుంచి కూడా చెత్త సేకరించడం మొదలుపెట్టారు. 

అడిగితే గొడవలకు దిగుతున్నారు. ఇండ్లల్లో ఒకవేళ చెత్త సేకరించకుంటే కంప్లయింట్​చేసే అవకాశమే లేకుండా పోయింది. బల్దియాకు కంప్లయింట్​చేసినా చర్యలు తీసుకునేవారు లేరు. గతంలో మేయర్‌‌‌‌‌‌‌‌గా, ప్రస్తుతం నాంపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మాజిద్​హుస్సేన్​ ఓ మీటింగ్‌‌‌‌లో శానిటేషన్​గురించి మాట్లాడుతూ.. తన ఇంటికే చెత్త తీసుకుపోవడానికి రావడం లేదని, అయినా తాను ఏం చేయలేకపోతున్నానని అనడం సమస్య తీవ్రతను తెలియజేసింది. 

  • రాయలసీమ లీడర్ల ఎంట్రీ ..

కార్మికుల ముసుగులో కొంతమంది రాయలసీమ లీడర్లు ఈ దందాలోకి దిగినట్టు తెలుస్తున్నది. సీమలోని పలువురు ఈ మాఫియాను పెంచి పోషిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్యవర్తుల అక్రమాలకు నిజమైన కార్మికులు నష్టపోతుండటంతోపాటు ప్రజలకు చెత్త సమస్య తీవ్రమైతున్నది. ఇండ్ల ఓనర్లకు తెలియకుండానే తమ ఏరియాలోని ఇండ్లను ఇతరులకు అమ్ముకుంటున్నారు. 500 ఇండ్ల కాలనీలకు సంబంధించి ఏరియాని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు విక్రయిస్తున్నారు. ఇటీవల హైటెక్ సిటీలో నెలకి రూ. లక్ష కలెక్షన్ వచ్చే ఏరియాని రూ.98 లక్షలకు కొనుగోలు చేశారు. 

కొత్త కాలనీలతోనే గొడవలు.. 

తాజాగా మూడు కార్పొరేషన్ల పరిధిలో కొత్తగా పుట్టుకొస్తున్న కాలనీల్లో చెత్త సేకరణ విషయంలో గొడవలు తలెత్తుతున్నాయి. కొత్త ఇండ్ల నిర్మాణాలు, అపార్టమెంట్లు జరుగుతున్న ప్రాంతాంలను తామంటే తామే సొంతం చేసుకోవాలని కార్మికులతోపాటు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గొడవలు జరుగుతున్నాయి. అవి కాస్తా హత్యలకు దారితీస్తున్నాయి. తమకు పోటీగా వచ్చే వ్యక్తులపై దాడులు చేయడం లేదా బెదిరిస్తూ ఆ ఏరియా శాశ్వతంగా తనకే సొంతం అవుతుందని  దాడులు చేస్తున్నట్టు తెలిసింది.  

  • సీఎం ఆదేశించినా..

మూడు కార్పొరేషన్ల ఏర్పాటు తర్వాత ముగ్గురు కమిషనర్లతో సీఎం రేవంత్​రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా సిటీలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతున్నదని తెలుసుకున్నారు. ముందు శానిటేషన్​సమస్యపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. దీంతో కమిషనర్లు చెత్త సేకరించే అసోసియేషన్లతో మీటింగ్​పెట్టి మాట్లాడారు. అన్ని ఏరియాల నుంచి చెత్త సేకరించాలని, అందరి దగ్గర కలెక్ట్​ చేయకపోవడంతో రోడ్లపై వేస్తున్నారని, ఇలాంటి పరిస్థితి రిపీట్​కావొద్దని వార్నింగ్​ఇచ్చారు. అయినా ఇప్పటివరకు పరిస్థితి మారలేదు. 

  • అల్లుళ్లకు కట్నం కింద ఏరియాలు..

చెత్త సేకరణ అనేది ప్రధాన ఆదాయ వనరుగా మారగా.. దీన్ని ఆస్తిగా చూపుతూ వివాహాల సమయంలో అల్లుళ్లకు కట్నం కింద ఏరియాలు రాసిచ్చే వరకూ వెళ్లింది. కూకట్‌‌‌‌పల్లిలోని మైత్రినగర్‌‌‌‌‌‌‌‌లో 2 వేల ఇండ్లు ఉండగా, ఇందులో 500 ఇండ్లను అల్లుడికి కట్నం కింద అప్పగించాడో స్వచ్ఛ కార్మికుడు. ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌లోనూ ఓ వ్యక్తి తన అల్లుడికి కట్నం కింద ఏరియా రాసిచ్చాడు. ఇలా నగరంలో కూతుర్లకు పెండ్లి టైంలో ఇవ్వడానికి తండ్రులు ఏరియాలను కాపాడుకోవాల్సి వస్తున్నది. ఇంత డిమాండ్ ఉంది కాబట్టే హత్యల వరకూ వెళ్తున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.