
- ప్లంజ్ పూల్‌పై క్లారిటీ ఇచ్చిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ
- గొయ్యి ఉన్నా ప్రమాదం లేదంటున్న నిపుణులు
శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ గేట్ల ముందు భాగంలో ఏర్పడిన ప్లంజ్ పూల్ (గొయ్యి) వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం స్పష్టం చేసింది. బుధ, గురువారాల్లో ప్రాజెక్టును సందర్శించిన బృందం, డ్యామ్ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రాజెక్టు వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర విషయాలను ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా బృందం సభ్యుడు డీకే శర్మ మాట్లాడుతూ ప్లంజ్ పూల్ ఉన్నా జలాశయానికి ఎలాంటి ముప్పు లేదన్నారు. అవసరమైతే రిపేర్లు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. డ్యామ్ స్థితిగతులు బాగానే ఉన్నాయని, త్వరలోనే పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టు సీఈ మాట్లాడుతూ 2018లో ప్లంజ్ పూల్ లోతు 47 మీటర్లుగా ఉండగా, 2025లో సీడబ్ల్యూసీ నిర్వహించిన సర్వేలో కూడా అదే స్థాయిలో ఉందన్నారు.
ఏడేళ్లలో లోతు పెరగకపోవడం వల్ల ప్రస్తుతానికి పెద్దగా ఆందోళన అవసరం లేదని కమిటీ చెప్పిందన్నారు. అయితే ముందుజాగ్రత్తగా ప్లంజ్ పూల్ డెప్త్ పెరగకుండా గేట్ల వద్ద, పక్క గోడల వద్ద మరమ్మతులు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం సిలిండర్లకు స్టీల్ ప్రోడక్ట్స్‌తో మెయింటెనెన్స్ చేస్తున్నామని, భవిష్యత్తులో కాంక్రీట్ వాల్ నిర్మించాలా లేదా సిలిండర్లనే కొనసాగించాలా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. డ్యామ్ రిపేర్ల కోసం ఏపీ ప్రభుత్వం రూ.203.05 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, ఇందులో అప్రోచ్ రోడ్డుకు రూ.25 కోట్లు, సైడ్ గ్రిట్టింగ్‌కు రూ.5 కోట్లతో ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు.