Reading Time: < 1 minute

అమరావతి: దేశంలో అన్ని పార్టిలది ఒక దారైతే.. వైసిపి మరో దారని, అమరావతి బిల్లుకు వైసిపి మినహా అన్ని పార్టీలు మద్దతిచ్చారని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా వ్యవహరించిందని, వైసిపి నేతలు, ఎపికి, ప్రజలకు ద్రోహం చేశారని, ఎపి నాశనమైనా పర్వాలేదని వైసిపి పట్టుదలతో ముందుకెళ్లిందని విమర్శించారు. అమరావతిని నాశనం చేయాలని వైసిపి చూస్తే.. తాము శాసనం చేశామని అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం ప్రజా విజయమని కొనియాడారు. అమరావతికి చట్టబద్దత బిల్లు ఆమోదించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ధన్యవాదాలు తెలియజేశారు.

సైద్ధాంతిక విభేదాలు ఉన్న పార్టీలు కూడా బిల్లు ఆమోదించిందని, రాజధాని లేకుండా ఎపిని విభజించారని, రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసి విభజన చేయాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. పరిపాలన చేసేందుకు ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు మండలాలను ఎపిలో విలీనం చేయించానని, తన అనుభవంతో తెలంగాణలోని ఏడు మండలాలను విలీనం చేయించానని చంద్రబాబు అన్నారు. పోలవరం ముంపు మండలాలను ఎపిలో కలిపితేనే ప్రమాణం చేస్తానని చెప్పానని, విజయవాడకు వచ్చినప్పుడు ఇరిగేషన్ ఎస్ఇ కార్యాలయమే తన క్యాంపు ఆఫీసని పేర్కొన్నారు. విడిపోయిన ఎపికి రాజధానిని నిర్మించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, దేశ ప్రయోజనాల కోసం అమరావతికి రాజధానిగా ఉండాలని చాలా పార్టీలు ఆలోచించాయని, తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.