
నక్సలిజం నిర్మూలనకు ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ మార్చి 31, 2026 ముగిసింది. ఇది రెడ్ కారిడార్‌గా పిలవబడే తొమ్మిది రాష్ట్రాల్లో కొండలు, అడవుల్లో విస్తరించి ఉన్న నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో దశాబ్దాలపాటు సాగిన మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగింపు దశకు చేరిన చారిత్రక ఘట్టాన్ని సూచిస్తుంది. ఒకప్పుడు దేశం లోని సుమారు 120 కి పైగా జిల్లాలను ప్రభావితం చేసిన మావోయిస్టులపై భద్రతా దళాలు నిరంతరం సాగించిన పోరుతో 2025 నాటికి నక్సలిజం గణనీయంగా క్షీణించింది. ఇప్పుడు మధ్య, తూర్పు భారతం లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. కొన్ని దశాబ్దాల హింసలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పౌరులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అయినప్పటికీ సాయుధ మావోయిస్టుల నిర్మూలనతో సమస్యలు ముగిసినట్టు కాదు. నక్సల్స్ బృందాలను భద్రతా బలగాలు ఎంత దెబ్బతీసినా, వారి వెనుక ఉన్న భావజాలం (ఐడియాలజీ) లేదా మూలకారణాలు ఇంకా సాక్షాలుగా మిగిలే ఉన్నాయి.
చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణం, టెలికమ్ నెట్‌వర్క్ విస్తరణ, బ్యాంకింగ్ సౌకర్యాలు, స్కూళ్లు, స్కిల్ సెంటర్లు వంటివి ఏర్పాటు కావడంతో భద్రతా బలగాలు ఆయా గ్రామాల్లోకి చేరుకుని భద్రత కల్పిస్తుండడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగి నక్సల్స్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇదంతా అభివృద్ధియే అని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ అభివృద్ధి అంటే కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. మానవాభివృద్ధి, జీవన ప్రమాణాలు ఏమాత్రం విస్తరించాయో పరిశీలించాల్సి ఉంది. మావోయిజం వర్ధిల్లడానికి గిరిజన సామాజిక వర్గాల్లో పేదరికం, సామాజిక బహిష్కరణ, విచ్ఛిన్నమైన విశ్వాసం తదితర కొన్ని కఠోర వాస్తవాలే ప్రధాన కారణాలు. గిరిజన వర్గాలు కొన్ని తమ భూములను, అటవీ హక్కులను కోల్పోతున్నాయి. బలమైన పెత్తందార్ల దోపిడీని ఎదుర్కొంటున్నాయి.
వీటికి తోడు అధికార యంత్రాంగం నిర్లక్షం వెంటాడుతోంది. ఇవన్నీ పరిష్కారం కాకుంటే మళ్లీ క్షేత్రస్థాయిలో మావోయిజం లేదా అలాంటి ఇతర ఉద్యమాలు పుట్టుకు రాక తప్పదు. భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్‌లో అటవీ హక్కుల చట్టం, పంచాయతీ రాజ్ చట్టాల ద్వారా ఆయా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులకు రక్షణ, స్థానిక స్వపరిపాలన కల్పించబడ్డాయి. ఈ ప్రాంతాల ప్రజల హక్కులను కాపాడటమే కాకుండా వారి బాగోగులను చూసుకునే ప్రత్యేక అధికారాలు గవర్నర్లకు ఉన్నాయి. అయితే ఇవి పేలవమైన అమలు కారణంగా విఫలమవుతున్నాయి తప్ప చట్టాల్లో లోపాలు ఉన్నందువల్ల కాదు. ఈ పరిస్థితుల్లో గవర్నర్లే గిరిజన ప్రయోజనాలను కాపాడే బాధ్యత వహించాలి. అలాగే పునరావాసం అనేది కేవలం ఒక చర్యగా మాత్రమే ఉండకూడదు. విద్య, ఆరోగ్యభద్రత, ఉద్యోగాలు, గౌరవం, ప్రతి కుటుంబానికి చేరువ కావాలి. మార్చి 31 వరకు ప్రభుత్వం ప్రధానంగా భద్రతా పరమైన అంశాల పైన, మావోయిస్టుల అంతం పైనే దృష్టి కేంద్రీకరించింది.
ఇప్పుడు గిరిజన బతుకుల్లో భద్రతతోపాటు ఉపాధి, ఉద్యోగాలు, అటవీ భూముల హక్కుల కల్పన వంటి సంఘర్షణకు దారితీసిన అంశాల పైనే ప్రభుత్వం దృష్టి మళ్లించవలసి ఉంది. వామపక్ష తీవ్రవాదం నిర్మూలన అనేది ఆ ప్రాంతాల అభివృద్ధికి శాంతి భద్రతల పునరుద్ధరణకు మంచి పరిణామం అయినప్పటికీ ఆ పేరుతో కార్పొరేట్ శక్తులు, క్రోనీ కేపిటలిస్టులు, గిరిజన ప్రాంతాల్లోని సహజ వనరులను ఇష్టారాజ్యంగా దోపిడీ చేసే అవకాశం ఇవ్వకూడదు. దీనికి బదులు గిరిజనులకు కల్పించవలసిన హక్కుల కల్పనకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వారికి భాగస్వామ్యం కల్పించడానికి కృషి సాగించాలి. నక్సల్స్ విముక్తికి డెడ్‌లైన్ మార్చి 30కి ముందు లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మూడేళ్ల పాటు పారామిలిటరీ ఆపరేషన్లు ముమ్మరంగా చేపట్టడం వల్ల 4839 మావోయిస్టులు లొంగిపోయారని, 2218 మంది అరెస్టు అయ్యారని, 706 మంది ఎన్‌కౌంటర్లలో తటస్థం అయ్యారని లెక్కలు వల్లించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్స్‌పట్ల సానుభూతి చూపించడం వల్లనే నక్సలిజం విపరీతంగా పెరిగిందని ఆరోపించారు.
కానీ వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు నక్సలిజం దేశ అంతర్గత భద్రతకు పెనుసవాలుగా గుర్తించి 200910 లో ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో నక్సల్స్ నిర్మూలనకు శ్రీకారం చుట్టారు. ఆనాడు ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని 180 జిల్లాల్లో నక్సలిజం తీవ్రంగా ఉండేది. కానీ నక్సల్ నివారణ చర్యలు చేపడితే పారామిలిటరీ నిర్వహణకు విపరీతంగా ఖర్చు చేయవలసి వస్తుందని, అనేక మంది ప్రాణాలు బలిగొనాల్సి వస్తుందని తీవ్ర విమర్శలు రావడంతో ఆ ఆపరేషన్ ఆగిపోయింది. కానీ ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వంద్వ విధానం పాటించారు. ఒకవైపు లొంగిపోయిన నక్సల్స్‌కు చర్చలద్వారా పునరావాసం కల్పిస్తామని, దీనిని వ్యతిరేకించిన వారిని హతం చేస్తామని హెచ్చరించారు. నక్సల్స్‌ను నిర్మూలించడం మారణహోమంగా పరిగణించే మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తల, మేధావుల అసంతృప్తిని లెక్కలోకి తీసుకోలేదు. పైగా వారిని అర్బన్ నక్సల్స్‌గా ముద్రవేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నక్సల్స్ భావజాలం వ్యతిరేకమని, అభివృద్ధికి వారు దోహదం చేయరని గిరిజనుల్లో ప్రచారం చేయించారు. మొత్తం మీద వామపక్ష ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో విజయం సాధించారు. ఇప్పుడు సయోధ్య రాజకీయాల ద్వారా యుద్ధ గాయాలను మాన్పడమే తక్షణ కర్తవ్యం.