Reading Time: < 1 minute
Iran Oil Tanker Ping Shun Diverts China India Payment Crisis Sanctions

Iran War: ఇరాన్ నుంచి క్రూడాయిల్‌తో భారత్‌కు వస్తున్న నౌక, చైనాకు మళ్లించబడింది. అమెరికా ఆంక్షలకు గురైన ఈ ట్యాంకర్ భారత్ వస్తున్న సమయంలోనే తన మార్గాన్ని మార్చుకుంది. ఈ షిప్ భారత్‌కు వచ్చి ఉంటే 2019 తర్వాత, ఇరాన్ నుంచి చమురు కొనడం ఇదే తొలిసారి అయ్యేది. 2025లో అమెరికా ఆంక్షలకు గురైన అఫ్రామాక్స్ ట్యాంకర్ ‘పింగ్ షున్’, ఈ వారం ప్రారంభంలో సూచించిన గుజరాత్‌లోని వడినార్‌కు బదులుగా, ఇప్పుడు చైనాలోని డోంగింగ్‌కు తన దిశను మార్చుకున్నట్లు ట్రాకింగ్ డేటా వెల్లడించింది.

Read Also: Bengal hostage row: ఎంఐఎం నాయకుడే మల్దా ఘటన సూత్రధారి.. పారిపోతుండగా అరెస్ట్..

అయితే, ఇలా మార్గం మధ్యలో భారత్ నుంచి చైనాకు వెళ్లడం వెనక కారణం చెల్లింపులు సమస్యలే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నౌకపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన కారణంగా డబ్బు లావాదేవీలు సమస్యగా మారాయి. ముఖ్యంగా ఇరాన్‌ను అంతర్జాతీయ బ్యాంకింగ్ నెట్వర్క్ స్విఫ్ట్ నుంచి తొలగించడం వల్ల చెల్లింపులు కష్టంగా మారాయి.

గతంలో 30-60 రోజులు క్రెడిట్‌పై డీల్స్ ఉండేవి, అయితే ఇప్పుడు అమ్మకందారులు ముందస్తు చెల్లింపుల్ని కోరుతున్నారు. ఇండియన్ రిఫైనరీలు ఈ రిస్క్ తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి వాణిజ్యానికి చైనా ముందుంది. ఈ కారణాల వల్లే చమురు నౌక తన దిశను మార్చుకుని చైనాకు వెళ్తుందని భావిస్తున్నారు. గతంలో ఇరాన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున ఆయిల్ దిగుమతి చేసుకునేది. కానీ యూఎస్ ఆంక్షల కారణంగా 2019లో నిలిపేసింది. ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో ఆయిల్ సంక్షోభం కారణంగా భారత్ మళ్లీ ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంది. ఇందుకు అమెరికా తాత్కిలిక సడలింపుల్ని కూడా ఇచ్చింది. అయితే, చెల్లింపుల వ్యవస్థ ఇక్కడ అడ్డంకిగా మారింది.