
ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. పంజాబ్‌కు ఇది వరుసగా రెండో గెలుపు కాగా, చెన్నై ఆడిన రెండింటిలోనూ పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (28) పరుగులు చేయగా సంజు శాంసన్ (7) మరోసారి విఫలమయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన అయూష్ మాత్రే అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు.
దూకుడుగా ఆడిన మాత్రె 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఐదు సిక్స్‌లతో 73 పరుగులు చేశాడు. ధాటిగా బ్యాటింగ్ చేసిన శివమ్ దూబె 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సర్ఫరాజ్ ఖాన్ 12 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (39), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (43) శుభారంభం అందించారు. కూపర్ కొనోలి (36) మరోసారి జట్టుకు అండగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ అలవోక విజయం అందుకుంది.