Reading Time: 2 minutes
Carmeni Selvam Review: కార్మేని సెల్వం సినిమా రివ్యూ.. సముద్రఖని మిడిల్ క్లాస్ బతుకు చిత్రం..!

మూవీ రివ్యూ: కార్మేని సెల్వం

నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా చంద్రమౌళి, అభినయ తదితరులు

సంగీతం: రామానుజన్

సినిమాటోగ్రఫీ: యువరాజ్ దక్షణ్

దర్శకత్వం: రామ్ చక్రి

 

కథ:

సెల్వం (సముద్రఖని) ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి. నెల తిరిగే సరికి వచ్చే పరిమితమైన జీతం, కట్టాల్సిన ఇంటి అద్దె, ఈఎంఐలు… ఇదీ అతని రొటీన్ లైఫ్. భార్య శాంతి, పిల్లలతో ఉన్నంతలో సంతోషంగా గడిపే సెల్వంలో షార్ట్ కట్‌లో డబ్బు సంపాదించాలి అనే అత్యాశ మొదలవుతుంది. ఆన్లైన్ యాడ్స్ చూసి క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్ ట్రేడింగ్ పట్ల ఆకర్షితుడవుతాడు. ఎలాగైనా కోటీశ్వరుడు అయిపోయి తన ఫ్యామిలీకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలనే గుడ్డి నమ్మకంతో పర్సనల్ లోన్స్, లోన్ యాప్స్ ద్వారా అప్పులు చేసి పెట్టుబడి పెడతాడు. కానీ మార్కెట్ క్రాష్ అవ్వడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్ల అతని భార్య శాంతి (లక్ష్మీప్రియ), పిల్లాడు కూడా నరకం అనుభవిస్తారు. ఫైనాన్షియర్ సంపత్ ఎంట్రీతో సెల్వం జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఈ ఆర్థిక ఉచ్చు నుంచి సెల్వం తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ.

కథనం:

దర్శకుడు రామ్ చక్రి ఎంచుకున్న పాయింట్ నేటి సమాజానికి అద్దం పట్టేలా ఉంది. ఆన్లైన్ బెట్టింగులు, లోన్ యాప్స్ మోజులో పడి మధ్యతరగతి కుటుంబాలు ఎలా రోడ్డున పడుతున్నాయో దర్శకుడు చాలా రియలిస్టిక్ గా ఎక్కడా కమర్షియల్ హంగులకు పోకుండా చూపించాడు. ఫస్ట్ హాఫ్ లో సెల్వం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. కానీ ఎప్పుడైతే సెల్వం క్రిప్టో ఉచ్చులో పడతాడో అక్కడి నుంచి కథ ఊపందుకుంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ తో నింపేశారు. లోన్ యాప్స్ వాళ్ళ దౌర్జన్యాలు చూస్తుంటే మన కళ్ల ముందే జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కాస్త ప్రెడిక్టబుల్ గా ఉన్నా ఇచ్చే మెసేజ్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది. సముద్రఖని నటన, నేటి సొసైటీకి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, గౌతమ్ మీనన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడా కనిపించే ల్యాగ్, ఊహించదగిన క్లైమాక్స్, ఎంటర్టైన్మెంట్ ఆశించే వారికి బోర్ కొట్టే అవకాశం ఉంది. కాకపోతే మంచి సినిమా చూసామన్న ఫీలింగ్‌తోనే బయటికి పంపిస్తాడు కార్మేనీ సెల్వం.

నటీనటులు:

సముద్రఖనికి ఇలాంటి పాత్రలు చాలా సులువు. ఒక నిస్సహాయుడైన తండ్రిగా, అప్పుల వాళ్ల ముందు తలదించుకునే భర్తగా ఆయన నటన అద్భుతం. సంపత్ పాత్రలో గౌతమ్ మీనన్ తనదైన స్టైలిష్ ప్రెజెన్స్ తో అదరగొట్టాడు. ఆయన బేస్ వాయిస్, డైలాగ్ డెలివరీ సినిమాకు మేజర్ హైలైట్. మిడిల్ క్లాస్ గృహిణి పాత్రలో లక్ష్మీ ప్రియా నటన చాలా సహజంగా ఉంది. భర్త తప్పు చేసినా కష్టకాలంలో అతనికి అండగా నిలబడే సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. మిగిలిన పాత్రలన్నీ ఓకే..

టెక్నికల్ టీం:

రామానుజన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఆత్మ లాంటిది. ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ చాలా బాగా ఎలివేట్ చేసింది. యువరాజ్ దక్షణ్ కెమెరా వర్క్ సినిమా మూడ్ కి తగ్గట్టుగా డార్క్ అండ్ గ్రే టోన్స్ లో సాగుతూ మధ్యతరగతి ఇరుకు బతుకులను కళ్లకు కట్టింది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు కథ డిమాండ్ మేరకు సరిగ్గా సరిపోయాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా కార్మేనీ సెల్వం.. మంచి సినిమా.. మిడిల్ క్లాస్ బతుకు చిత్రం..!