
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. రైతు భరోసాకు సంబంధించి మరో ముఖ్య నిర్ణయం వెలువడింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ఆర్థిక శాఖ రూ.2,650 కోట్లను సమీకరించే పనిలో పడింది. ప్రభుత్వ ఖర్చులు, ఇతర చెల్లింపుల తర్వాత రైతులకు అవసరమైన నిధులు అందించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విడతలో ఎకరానికి మించి భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా సుమారు 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులు ఈ దఫాలో ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, మొదటి విడతలో ఇప్పటికే 70 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్లను మార్చి 22న జమ చేశారు. దీంతో వ్యవసాయ పనులకు కొంత ఆర్థిక ఊరట లభించింది. మిగతా రైతులకు మూడో విడతలో నిధులు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈనెల చివరినాటికి మొత్తం చెల్లింపులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇదిలావుంటే, ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున సాయం అందిస్తున్న ప్రభుత్వం, మొత్తం పథకం అమలుకు దాదాపు రూ.9 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. నిధుల పరిమితి కారణంగా ఈసారి మూడు దశల్లో డబ్బులు విడుదల చేసే విధానాన్ని అనుసరిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..