
కరీంనగర్ చరిత్ర కన్నీరు పెట్టిన రోజు 27 మార్చి, 2026. ఆ రోజు డా. జైశెట్టి రమణయ్య కన్నుమూశారు. 17వ ఏటనే ఉపాధ్యాయ కొలువు చేపట్టి జగిత్యాలలో పురాతన ఖిల్లా దారిలో వెళుతుంటే ఆయన చూపు, మనసు అంతా ఆ దుర్గమ కట్టడం వైపే ఉండేది. తాను చదివిన పుస్తకాల్లో దీని ప్రస్తావనే లేకపోవడం ఆయనను కలచివేసేది. అలా రమణయ్య శోధన చరిత్ర వైపు మళ్లింది. మరింత లోతైన విజ్ఞానం కోసం చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అంతటితో ఆగకుండా పురాతన దేవాలయాలపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందారు. అలా ఆయన 87ఏళ్ల జీవితకాలం కరీంనగర్ ప్రాంత పురా విశేషాలను, ప్రత్యేకతలను వెదుకులాటకే అంకితమైంది. శాతవాహనుల కాలం నుండి అసఫ్ జాహీల దాకా సాగిన పరిపాలన విశేషాలెన్నో ఆయన పరిశోధనద్వారా వెలుగు చూశాయి. తమ పరిశోధనా ఫలితాలను కరీంనగర్ జిల్లా చరిత్ర, సంస్కృతిగా గ్రంథస్తం చేశారు. ఎంతో విలువైన సమాచారాన్ని క్రోడీకరించి తన తర్వాతి తరం పరిశోధకులకు ఆయన మార్గదర్శకులయ్యారు.
పూర్వ కరీంనగర్ జిల్లా పురాతన కట్టడాలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. ఎన్నో గ్రామాల్లో ఆదరణకు నోచుకోని శిల్పాలు, శిలా శిథిలాలు చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిపోయాయి. గుట్టల ప్రాంతమైన ఈ జిల్లాలో రాళ్లపై విగ్రహాలు, శాసనాల చెక్కడాలు విరివిగా కనిపిస్తాయి. రాజుల ప్రాశస్త్యమంతా రాళ్లమీదే మిగిలినట్లు చరిత్రకారుల దృష్టి వీటిపైకి మళ్లలేదు. వ్యవసాయ ప్రధానమైన కరీంనగర్ ప్రాంతం చారిత్రక పరిశోధనల విషయంలో నిరాదరణకు గురైందని చెప్పవచ్చు. అలాంటి సందర్భంలో స్థానికుడిగా, చరిత్ర అధ్యయనం చేసిన వ్యక్తిగా రమణయ్య స్వీయ ఆసక్తితో జగిత్యాల, ఎలగందుల ఖిల్లాల చరిత్రను వెలికి తీశారు. శాతవాహనుల రాజధాని కోటిలింగాలపై తమ పరిశోధనలను పుస్తకంగా తెచ్చారు. జిల్లాలోని గ్రామాల, పట్టణాల పేర్ల వెనుక ఉన్న కారణాలను వెదికి, వాటిలోని చారిత్రకాంశాలను వివరించారు.
ఆయన రాసిన ‘కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి’ ఒక ప్రామాణిక గ్రంథం. పరిశోధకులకు మార్గదర్శిగా, పలు పునర్ముద్రణలు పొందిన రచనగా ఇది నిలుస్తుంది. తెలంగాణ సుప్రసిద్ధ దేవాలయాలు, తెలంగాణ సుప్రసిద్ధ కోటలు, శ్రీవేములవాడ క్షేత్ర చరిత్ర, తెలంగాణ తేజోవంతులు, కాలగమనంలో కోనసముద్రం తదితర పుస్తకాలు రమణయ్య ఇతర రచనలు. 2018 లో వీరు ‘సొంత ఎదుగుదల’ అనే స్వీయ చరిత్రను రాసుకున్నారు. 1939లో జగిత్యాలలోని వైశ్య కుటుంబంలో పుట్టిన ఆయన పల్లెటూరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఒంటరి ప్రయాణం ఆరంభించి చరిత్రకారుడిగా ఎదిగిన క్రమం ఈ ఆత్మకథలో చూడవచ్చు. అధ్యాపక వృత్తిని ఎంచుకున్న వారికి వీరి జీవన గమనం స్ఫూర్తిగా నిలుస్తుంది. వీరి తాత జైశెట్టి రాజయ్య పద్యకవి. 1933 లో ఆయన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం, మనస్సంబోధ కీర్తనలు రాశారు. రమణయ్య వాటిని 1992లో పునర్ముద్రించారు. టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా, ది చాళుక్యాస్ అండ్ కాకతీయ టెంపుల్స్ -ఏ స్టడీ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అనే పుస్తకాలు ఇంగ్లీషులో వెలువరించారు. చరిత్ర అధ్యాపకులైనా.. రమణయ్యకు ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉంది. ఆ రోజుల్లో పదవ, ఇంటర్ విద్యార్థులు ఎక్కువగా ఇంగ్లిష్‌లో ఫెయిల్ అవడంతో వారి కోసం సులభంగా అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ అనే పుస్తకం రాశారు. ఆ పరీక్షల్లో వచ్చే వ్యాకరణాంశాలను అందులో వివరించి ఎందరో విద్యార్థులు ఆ తరగతులు గట్టెక్కేలా తోడ్పడ్డారు.
అధ్యాపకుడు, చరిత్ర పరిశోధకుడే కాకుండా రమణయ్య మంచి వక్త. ఏ విషయం పైనైనా సాధికారికంగా మాట్లాడగల ప్రజ్ఞాశాలి. కాలేజీల్లో ఏ సాహితీ, సాంస్కృతిక, వార్షిక సభలు, సమావేశాలు జరిగినా నిర్వహణ బాధ్యత తనపై వేసుకునేవారు. స్పష్టమైన గొంతుతో, చక్కని భాషలో, లోతైన పరిజ్ఞానంతో సాగే ఆయన సభా పరిచయ వాక్యాలు, ప్రసంగాలు సభికులను మంత్రముగ్ధుల్ని చేసేవి. విద్యార్థులంటే ఎంత ప్రేమనో, వృత్తిపట్ల అంతే నిబద్ధత కనబరచేవారు. కాలేజీ సెలవుల్లో విజ్ఞానయాత్రలు ఏర్పాటు చేసి విద్యార్థులను దేశంలోని చారిత్రక ప్రాంతాలకు తీసుకెళ్ళేవారు. కరీంనగర్‌కు సమీపంలోని ఎలగందుల ఖిలాలో పదేళ్ల క్రితం ఏర్పాటు చేరిన సౌండ్ అండ్ లైట్ షో కి అవసరమైన వ్యాఖ్యానాన్ని రమణయ్య అందించారు. 1971లో రమణయ్య సిద్దిపేట జూనియర్ కాలేజీలో పని చేశారు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన విద్యార్థి. 2024 లో రాజకీయ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలో కెసిఆర్ ఓ రోజు బస చేసినపుడు రమణయ్య ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్న కెసిఆర్ గురువుకు పాదాభివందనం చేశారు. వ్యక్తిగా, అధ్యాపకుడిగా పరిపూర్ణ జీవితాన్ని అందుకొని, దానిని ఎందరికో ఉపయోగపడేలా మలుచుకున్న రమణయ్య మాస్టారు సదా ఆదర్శప్రాయులు.
– బి.నర్సన్
– 9440128169