Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: వక్ఫ్‌బోర్డు సీఈఓ, చైర్మన్‌ల మధ్య సఖ్యత లేకపోవడం తో వక్ఫ్‌బోర్డు భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. వారిద్దరి మధ్య అంతర్గతంగా వివాదాలు ముదరడంతో వక్ఫ్‌బోర్డులో జరిగే నిధుల స్వాహాపై చర్యలు చేపట్టడం లేదని, రెండు వర్గాలుగా విడిపోయి తమ వారిని కాపాడుకోవడానికి వారిద్దరూ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. దీంతో వక్ఫ్‌బోర్డు ఆస్తులన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని ఆ శాఖ ఉద్యోగులు, మైనార్టీలు ఆరోపిస్తున్నారు. సుమారు రెండేళ్లుగా వక్ఫ్‌బోర్డు సమావేశాన్ని నిర్వహించకపోవడంతో సంబంధిత ఆస్తులు, నిధులు పక్కదారి పడుతున్నాయి. ఆడిటింగ్ లేకపోవడంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్న దర్గాలకు సంబంధించిన ఆస్తు లు, భక్తుల నుంచి వచ్చే కానుకలు సైతం స్వాహా అవుతున్నాయని దీనిపై విచారణ చే యించాలని మైనార్టీ నాయకులు, ఆ శాఖ ఉ ద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

వక్ఫ్‌బోర్డు పరిధిలో 5 పెద్ద దర్గాలు ఉండగా వాటి ద్వా రా సంవత్సరానికి కోట్ల రూపాయల ఆదా యం వస్తోంది. అయితే ఈ దర్గాల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌లు దర్గా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇవ్వాల్సి ఉండగా వాటిని కొందరు వక్ఫ్‌బోర్డు ఉద్యోగులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాన్సువాడలోని దర్గా, మహబూబ్‌నగర్ పరిధిలోని ఎంఎన్ నర్వ దగ్గర ఉన్న జహంగీర్ పీర్ దర్గా,నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ దగ్గర ఉన్న దర్గ హజరత్ జాన్ పహాడ్, వరంగల్‌లోని దర్గ హజరత్ అన్నారం షరీఫ్, నాంపల్లిలోని యూసుఫన్ షరీఫ్ దర్గాలు ఉండగా వాటితో పాటు మరికొన్ని చిన్నదర్గాలు ఉన్నాయి. అయితే, ఈ దర్గాల దగ్గర జాతరల సందర్భంగా అభివృద్ధి పనులను చేపట్టే సమయంలో కాంట్రాక్టర్ వేలం పాట ద్వారా పనులను చేపడుతారు. జాతర అనంతరం వచ్చిన డబ్బులను కాంట్రాక్టర్‌కు చెల్లించి మిగతా డబ్బులను వక్ఫ్‌బోర్డు ఖాతాలో వేస్తారు.

అయితే, కొన్నేళ్లుగా ఈ దర్గాలకు భక్తులు ఇచ్చే కానుకలు, నిధులు స్వాహా అవుతున్నాయని, దీంతో కాంట్రాక్టర్‌లకు కూడా డబ్బులు చెల్లించకపోవడంతో వారంతా వక్ఫ్‌బోర్డు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దర్గాల దగ్గర పనిచేసే కొందరు హుండీలోని డబ్బులను, భక్తులు ఇచ్చే కానుకలను స్వాహా చేస్తున్నారని అందుకే తమకు బిల్లులు చెల్లించడానికి నిధులు లేకుండా పోయాయని ఈ విషయమై వక్ఫ్‌బోర్డు సీఈఓ, చైర్మన్‌లకు ఫిర్యాదు చేశామని, అయినా తమకు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్‌లు ఆరోపిస్తున్నారు.

10వ తరగతి పాస్ కాకున్నా గెజిటెడ్ అధికారిగా పదోన్నతులు

దీంతోపాటు వక్ఫ్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు ఒకే సెక్షన్‌లో 15 ఏళ్లుగా పనిచేస్తున్నారని, మరికొందరికి 10వ తరగతి పాస్ కాకున్నా గెజిటెడ్ అధికారిగా పదోన్నతులు కల్పించారని దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినా వారిపై కనీసం చర్య తీసుకోవడం లేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు కొందరు నిరుద్యోగులను డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేసుకొని వారి ఉద్యోగాన్ని పర్మినెంట్ చేశారని, వారికి అర్హత లేకున్నా ఎలా ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటారని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇలా వక్ఫ్‌బోర్డు పరిధిలో పనిచేసే ఉద్యోగుల పదోన్నతులు, రిక్రూట్‌మెంట్, నిధుల స్వాహా, భూముల అన్యాక్రాంతంపై అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి, వక్ఫ్‌బోర్డు అధికారులకు వచ్చినా వాటిపై కనీసం బోర్డు సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మెట్రో అధికారులు అద్దెకు అడిగినా ఇవ్వని వక్ఫ్‌బోర్డు

వక్ఫ్‌బోర్డుకు సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో వేల కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. అయితే, ఈ భూములపైకన్నేసిన కొందరు అక్రమార్కులు వక్ఫ్‌బోర్డుకు చెందిన కొందరు ఉన్నతాధికారులతో కలిసి తప్పుడు పత్రాలను సృష్టించి ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని, దీనిపై వక్ఫ్‌బోర్డు ఫిర్యాదు చేయకుండా ప్రేక్షకపాత్ర వహిస్తుందని ఆ శాఖ ఉద్యోగులు, మైనార్టీలు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం వక్ఫ్‌బోర్డు ప్రధాన కార్యాలయం పక్కన ఉన్న పాత బిల్డింగ్‌ను నిర్మాణం పేరుతో 15 ఏళ్ల క్రితం దానికి పిల్లర్‌లు వేసి 7 అంతస్థులు గోడలు లేపినందుకు రూ.60 కోట్ల ఖర్చు చూపించారని, దీనిపై ఆడిటింగ్ నిర్వహించాలని గతంలో ప్రభుత్వం ఆదేశించినా దానిపై ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగం నిర్మించిన ఈ భవనాన్ని గతంలో మెట్రో అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ కోసం అడిగారని, నెలకు రూ.20లక్షల కిరాయి ఇస్తామన్న దానిని ఇవ్వకుండా అలాగే వదిలేయడంతో నిర్మాణం కోసం వినియోగించిన రూ.60 కోట్ల నిధులు నిరుపయోగంగా మారాయని ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.