
- ఆడపిల్ల అని తెలిసి గతంలోనే రెండు సార్లు అబార్షన్
- మూడోసారి గర్భస్రావానికి అంగీకరించకపోవడంతో భార్యభర్తల మధ్య గొడవలు
- హనుమకొండ జిల్లా పున్నేలు శివారులో ఘటన
హనుమకొండ, వర్ధన్నపేట, వెలుగు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు శివారులోని స్విమ్మింగ్ పూల్ లో పడి బుధవారం రాత్రి తల్లీ, ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. మూడోసారి అబార్షన్ కు ఒప్పుకోకపోవడం వల్లే తమ కూతురితో పాటు పిల్లలను చంపి నీటిలో పడేశారని మృతురాలి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేయడంతో తండ్రే వారిని స్విమ్మింగ్ పూల్ లో పడేశాడనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
వరంగల్ కరీమాబాద్ కు చెందిన ఫర్హత్(26) చిన్నప్పటి నుంచి ఐనవోలు మండలం పున్నేలులోని తన పిన్ని వద్ద పెరిగింది. అదే గ్రామానికి చెందిన అజారుద్దీన్ ను ప్రేమించగా.. వారి పెళ్లి పెద్దల సమక్షంలో జరిగింది. వారికి ఉమేరా(8), అయేషా(6) కూతుళ్లు ఉన్నారు. అజారుద్దీన్ వరంగల్,–ఖమ్మం జాతీయ రహదారి సమీపంలోని పున్నేలు క్రాస్ వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నాడు.
అబార్షన్ విషయంలో గొడవలు?
ఫర్హత్, -అజారుద్దీన్ లకు ఇద్దరు ఆడపిల్లలుండగా.. ఇదివరకు ఫర్హత్ రెండుసార్లు గర్భం దాల్చగా, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని అజారుద్దీన్ అబార్షన్ చేయించాడు. మూడు నెలల కింద ఫర్హత్ మరోసారి ప్రెగ్నెంట్ కాగా.. ఈసారీ అమ్మాయేనని తేలింది. దీంతో మళ్లీ అబార్షన్ చేయించుకోవాలని ఫర్హత్ పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఫర్హత్ ఒప్పుకోకపోవడంతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే బుధవారం పెద్ద కూతురు ఉమేరా పుట్టినరోజు కావడంతో అంతా కలిసి బిర్యానీ తీసుకుని సాయంత్రం స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఫర్హత్, ఉమేరా, అయేషా స్విమ్మింగ్ పూల్ లో శవాలై తేలారు. వాష్ రూంకు వెళ్లిన అజారుద్దీన్ తిరిగి వచ్చేసరికి ముగ్గురూ స్విమ్మింగ్ పూల్ లో పడి ఉన్నారని అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. అతడే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు
చెప్తున్నారు.
అజారుద్దీన్ పై అనుమానాలు
మూడోసారి అబార్షన్ కు ఫర్హత్ ఒప్పుకోకపోవడంతో అజారుద్దీన్ తమ కూతుర్ని, పిల్లల్ని చంపి నీటిలో పడేశాడని ఫర్హత్ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉండటంతో పక్కా ప్లాన్ ప్రకారమే తల్లీ,కూతుళ్లను హతమార్చాడనే ప్రచారం జరుగుతోంది. ఫర్హత్ ను చంపి నీళ్లలో పడేయగా.. అది చూసిన పిల్లలు ఎవరికైనా చెప్తారేమోనన్న భయంతో వారినీ చంపినట్లు అనుమానిస్తున్నారు.
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు అజారుద్దీన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ గురువారం సాయంత్రం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని సీపీ ఆదేశించారు.