Reading Time: 2 minutes

టీడీఆర్కు మరింత డిమాండ్.. ఇప్పటికే 50 నుంచి 60 శాతం అదనపు ధర

Caption of Image.
  • సవరణతో ‘డబుల్’ ​ఇన్​కం 
  • సెట్​బ్యాక్, ఇతర రిలాక్సేషన్స్​తో రియల్టర్ల సంతోషం
  • దాచి పెట్టుకుంటున్న టీడీఆర్​ హోల్డర్స్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: భవన నిర్మాణాలకు సంబంధించి టీడీఆర్ (ట్రాన్స్‌‌ఫరబుల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ రైట్స్‌‌) విషయంలో ప్రభుత్వం కొన్ని సవరణలు చేయడంతో టీడీఆర్ కు డిమాండ్ పెరగనున్నది. ఇదివరకు1000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటేనే జీ+5 (18 మీటర్లు) అంతస్తుల వరకు కట్టుకోవడానికి అనుమతి ఉండేది. అయితే, గత నెల 21న విడుదల చేసిన జీవో 95 ద్వారా టీడీఆర్​ఉన్నవారికి మరిన్ని అవకాశాలు దక్కనున్నాయి. తాజా సవరణల ప్రకారం, ప్లాటు కనీస విస్తీర్ణాన్ని 750 చదరపు మీటర్లకు తగ్గించారు.

టీడీఆర్ ఉంటే 750 నుంచి 2,000 చదరపు మీటర్ల ప్లాటులో 21 మీటర్ల ఎత్తు (జీ+6 అంతస్తులు) వరకు నిర్మించుకోవచ్చు. 2,000 చ.మీ. కంటే ఎక్కువ స్థలం ఉండి, రోడ్డు వెడల్పు 40 అడుగుల కంటే ఎక్కువ ఉంటే, జీ+5 అంతస్తులకు అదనంగా మరో 3 ఫ్లోర్లు కట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 

రోడ్డు వెడల్పు 60 అడుగులుంటే అదనంగా 4 అంతస్తులు, 80 అడుగులుంటే 5 అదనపు ఫ్లోర్ల నిర్మాణానికి అనుమతి లభిస్తుంది. అలాగే, సెట్ బ్యాక్ కి సంబంధించి కూడా టీడీఆర్ తో 10 శాతం మినహాయింపు కల్పించింది.10 నుంచి 20 అంతస్తులు కట్టుకుంటే టీడీఆర్​తో 3 శాతం వరకు అదనపు బిల్ట్- అప్ ఏరియా పెంచుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన ఈ రిలాక్సేషన్ నిర్మాణదారులకు మంచి కిక్కు ఇచ్చింది. ఇప్పటికే రియల్టర్లు మార్కెట్ ధర కంటే 50 నుంచి 60 శాతం ఎక్కువకు టీడీఆర్ కొంటున్నారు. రూ. లక్ష విలువ ఉన్న టీడీఆర్ ని రూ.1.60  లక్షలకు కొంటున్నారు.  తాజా సవరణలతో ఇది రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉంది. దీంతో టీడీఆర్​ఉన్నవారు వాటికి భవిష్యత్​లో మరింత ధర పెరుగుతుందని దాచి పెట్టుకుంటున్నారు. 

టీడీఆర్​ ఎవరికిస్తారు? 

నగరంలో రోడ్లు, నాలాల  విస్తరణ తదితర పనుల కోసం అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో భాగంగా భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, నగదు చెల్లింపులకు బదులుగా మార్కెట్​వాల్యూని బట్టి టీడీఆర్‌‌ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంటారు. ఆర్థిక భారం తగ్గించేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రాలు టీడీఆర్ ఇవ్వడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. చెరువుల ఎఫ్టీఎల్ బాధితులకు కూడా టీడీఆర్  రూపంలోనే పరిహారం ఇచ్చేందుకు హైడ్రా సిద్ధమైంది. అలాగే, ఎవరైనా నిర్వాసితుడు రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోతే అంతకు నాలుగు రెట్లు,.. నాలాలు, వాటర్ బాడీస్ లో కోల్పోతే రెండు రెట్లు ఎక్కువ లాభం వచ్చేలా బల్దియా టీడీఆర్‌‌ పేపర్లు ఇస్తోంది.

ఈ తరహాలో పాత జీహెచ్ఎంసీ పరిధిలో  దాదాపు 38 లక్షల చదరపు గజాల టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేశారు. వీటిలో దాదాపు 20 లక్షల చదరపు గజాలకు సంబంధించిన టీడీఆర్‌‌లను వినియోగించుకున్నారు.  ప్రస్తుతం మార్కెట్లో టీడీఆర్ కి మస్తు డిమాండ్ ఉంది. మార్కెట్​లో టీడీఆర్ విలువ కంటే 50 శాతానికిపైగా అదనంగా ఉంది.

టీడీఆర్ అంటే.. 

టీడీఆర్ అనేది భూమి కోల్పోయిన యజమానికి ప్రభుత్వం ఇచ్చే హక్కు పత్రం. దీని ద్వారా కోల్పోయిన భూమి స్థానంలో వేరే చోట స్థలం ఉంటే అదనపు అంతస్తులను నిర్మించుకోవచ్చు. ఒకవేళ టీడీఆర్ ఉన్నవారికి నిర్మించుకునే స్థోమత లేకపోతే ఆ సర్టిఫికెట్‌‌ను బహిరంగ మార్కెట్‌‌లో అమ్ముకోవచ్చు. ఇది భూమికి ఇచ్చే నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.  

©️ VIL Media Pvt Ltd.