
తెలంగాణలో ఇంకో ప్రాంతీయ రాజకీయ పార్టీ పుట్టుక, మనుగడకు తావుందా? కల్వకుంట్ల కవిత ప్రకటించే పార్టీ ఎజెండాలో ప్రత్యామ్నాయ సామాజిక, ఆర్థిక పంథా ఏముంటుంది? ఆమెపెట్టే పార్టీ మనుగడను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నా ప్రధానంగా ఈ రెండు విషయాలు కీలకం కానున్నాయి. ఏప్రిల్ 25 న పార్టీని ప్రారంభిస్తామని అప్పుడే ఎజెండాను ప్రకటిస్తామని ఆమె ఇదివరకే వెల్లడించి ఉన్నారు. 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలుపరచాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో ‘ఒక ఆడబిడ్డ పార్టీ పెడితే ఎంత దీటుగా ఉంటుందో చూస్తారు’ అంటూ కవిత చేసిన ప్రకటన రాజకీయాల్లో మహిళలు మరింత క్రియాశీలతకు దారులు పరుస్తుందా? ఈ ప్రయోగం ఏ పరిణామాలకు దారితీస్తుంది? ఇప్పటికే రెండు జాతీయపార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రత్యర్థులుగా ముక్కోణపు పోటీ నెలకొన్న రాష్ట్రంలో కొత్త పార్టీ విస్తరణకుండే అవకాశమెంత? ఇప్పటికి ఇవన్నీ సమాధానాలు రావాల్సిన ప్రశ్నలే!
ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ప్రస్తుతమున్న పాలక, ప్రతిపక్షాల ఒరవడికి భిన్నంగా సామాజిక, ఆర్థిక ప్రత్యామ్నాయాన్ని కవిత ఎజెండాగా చూపాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రసాధనకు ఉద్యమించి, రాష్ట్రం వచ్చాక ఇకపై తమది ఫక్తు రాజకీయపార్టీగా మారిందంటూ పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ లో ఆమె సుదీర్ఘ కాలం ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ వంటి వివిధ రాజకీయ హోదాల్లోనూ పనిచేశారు. కె.చంద్రశేఖరరావు తనయగా ఉంటూ ‘జాగృతి’ సామాజిక, సాంస్కృతిక వేదికకు ఆవిర్భావం నుంచీ కవిత నేతృత్వం వహించారు. బయటి ప్రపంచానికి జాగృతి బీఆర్‌ఎస్ పార్టీలో భాగంగానో, అనుబంధ విభాగంగానో కనిపించినా.. తాను స్వతంత్రంగా నిర్వహించానని ఆమె చెబుతుంటారు. బీఆర్‌ఎస్ అంతర్గత వ్యవహారాలు ఆమెకు నచ్చక ప్రతికూల వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నాయకత్వానికి కవితకు మధ్య ఎడం పెరిగింది.
తెలంగాణ భౌగోళికంగా ఏర్పాటయిందే తప్ప దశాబ్ది దాటినా సామాజిక న్యాయం జరగలేదని, సామాజిక తెలంగాణ ఇంకా ఏర్పడలేదనే వ్యాఖ్య ద్వారా గళం విప్పి నిర్ధిష్టంగా పలు విమర్శలు చేశారు. తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌పై ప్రత్యక్ష ఆరోపణలు చేయకుండానే సోదరుడు కేటి.రామారావుపైన, కుటుంబసభ్యులైన మరో మాజీమంత్రి టి.హరీష్‌రావు, మాజీ ఎం.పి. సంతోష్‌కుమార్‌పైన ప్రత్యక్ష ఆరోపణలు చేస్తూ వచ్చారు. గత సంవత్సరం సెప్టెంబరు 2న పార్టీ నుంచి ఆమె సస్పెన్షన్‌కు గురయ్యారు. అక్టోబర్ 25 నుంచి ‘జాగృతి జనం బాట’ పట్టి ప్రతి జిల్లాలో రెండేసి రోజుల చొప్పున పర్యటించడం, మేధావులు, ఉద్యమకారులు, ఆలోచనాపరులతో భేటీలు ఫిబ్రవరి మధ్యకాలం వరకు నిర్వహిస్తూ వచ్చారు.
- సామాజిక తెలంగాణే ఎజెండానా?
బీఆర్‌ఎస్ నుంచి వేర్పడిన తర్వాత కొత్త రాజకీయ పార్టీకి సన్నాహాలు చేస్తున్న కవిత ఇప్పటివరకు చేస్తూ వస్తున్న నినాదాల్లో ముఖ్యమైంది ‘సామాజిక తెలంగాణ’ వాదం. సందర్భాన్ని బట్టి వేర్వేరు అంశాల్లో ఆమె క్రియాశీలకంగా ఉంటూ సామాజిక తెలంగాణ సాధన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధాన ఖరారులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందనే అభియోగాలతో నమోదైన ‘లిక్కర్ కేసు’లో కవిత జైలుకు వెళ్లివచ్చారు. అందుకు తగిన ఆధారాలను దర్యాప్తు సంస్థ సీబీఐ చూపలేకపోయిందని, నిందితులపై అభియోగాలను కింది కోర్టు కొట్టివేసింది. దాంతో తాను ‘కడిగిన ముత్యం’ లా బయటకు వచ్చానని కవిత ప్రకటించారు. దర్యాప్తు సంస్థ ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేయడంతో కేసు ఇంకా కొనసాగుతోంది. నిర్ధోషిత్వం ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఈలోపున జనాదరణని పెంచుకోవడం కోసం, అణగారిన వర్గాల తరపున నిరంతరం గొంతు వినిపిస్తూనే ఉన్నారు.
- అవకాశవాద మౌనం తప్పు కాదా?
బీసీ రిజర్వేషన్లని, దళితులకు న్యాయమని, మహిళలకు రిజర్వేషన్లని, ఉద్యమకారులకు గుర్తింపు,- అమరుల కుటుంబాలకు ఆదరణ అవసరమని ఆమె తరచూ ప్రసారమాధ్యమాల్లో ఉంటున్నారు. ఎక్కడ ఆందోళన జరిగితే అక్కడికి స్వయంగా వెళుతున్నారు. ధర్నాచౌక్ నిరసనదారుల నుంచి ఖమ్మం భూదాన భూనిర్వాసితుల వరకు మద్దతిస్తూ దన్నుగా నిలుస్తున్నారు. సమయం, సందర్భాన్ని బట్టి పాత-కొత్త పాలకులపైన విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్‌ఎస్ పై కవిత ఇప్పుడు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు సంబంధించిన పరిణామాలు జరుగుతున్నప్పుడు అక్కడే ఉండి కూడా ఎందుకు లేవనెత్తలేదు? అవకాశవాద మౌనం తప్పు కాదా? అని ఆమె ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడామె బాధ్యతలేని అధికారంలో ఉన్నారని, ఆమె నిత్యం విమర్శించే కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లు కనీసం బాధ్యతతో కూడిన అధికారం అనుభవించారనేది వారి వాదన.
- ముందో, వెనకో పెద్ద సభ
కవిత తన పార్టీ ప్రారంభించడానికి కాస్త ముందుగానో, కొంచెం తర్వాతో బీఆర్‌ఎస్ ఒక పెద్ద సభ పెట్టనుంది. ఆమె ఏప్రిల్ 25న పార్టీ ప్రారంభిస్తుంటే ఏప్రిల్ 27 బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వస్తున్న సీనియర్ నాయకుడు టి.జీవన్‌రెడ్డి చేరిక సభను హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఏప్రిల్ 26న గాని, పార్టీ ఆవిర్భావ దినమైన 27నగాని, కవిత పార్టీ ఏర్పాటు కన్నా ముందుగానే, ఇదే నెల 19నగాని జరపాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీకి చెందిన ముఖ్యులెవరూ కవితతో లేరని, ఆమె వెంట వెళ్లరని బీఆర్‌ఎస్ నాయకులు ధీమాతో ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కొందరు తనతో సంప్రదింపుల్లో ఉన్నారని కవిత చెబుతూ వస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ బడానేతలు ఆమెతో ఉన్నట్టు కనిపించలేదు. అమెరికా గురించి ట్రంప్, భారత్ గురించి మోదీ ప్రచారం చేసుకున్నట్టే ‘తెలంగాణ ఫస్ట్’ అన్నది తమ నాయకురాలి నినాదమని కవిత అనుచరగణం చెబుతారు. అదే ప్రత్యేకమంటారు.
- అధికారం లభిస్తే అమలు వైఖరేంటి?
కవిత పార్టీకి అధికారం లభిస్తే అమలు వైఖరేంటి అన్నది ముఖ్యం. ఇప్పుడు కవిత చెబుతున్నట్టే ‘నక్సలైట్ల ఎజెండా మా ఎజెండా ఒకటే, పేదల అనుకూల వైఖరి’ అని లోగడ కేసీఆర్ కూడా అన్నారు. 1983 ములుగు, నర్సంపేటల్లో తిరుగుతూ ‘నక్సలైట్లు దేశభక్తులు’ అన్న ఎన్టీరామారావు కూడా అధికారంలోకి వచ్చాక భిన్నంగా వ్యవహరించారు. దళిత ప్రయోజనాల గురించి మాట్లాడే కవిత, ‘మతం మారిన దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్ అనుభవించరాదన్న సుప్రీంకోర్టు తీర్పుపైన కూడా తన వైఖరి స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎన్ని వస్తాయో? వాటికి సిద్ధంగా ఉండి రాజకీయ ఆటుపోట్లను తట్టుకోగలగాలి. 2028 ఎన్నికల నాటికి
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి పాలక కాంగ్రెస్ పక్షానికి పావుగా ఉపయోగపడటం తప్ప సాధించేదేమీ ఉండదనే విమర్శ ఉంది.
- జనం నమ్మితేనే నిలిచేది
ఏదో ఒక ప్రత్యేకత లేకుండా కొత్త రాజకీయ పార్టీ జనంలోకి చొచ్చుకుపోవడం కష్టం అనేది రాజకీయ పండితుల భావన. ప్రత్యామ్నాయ సామాజిక, ఆర్థిక ఎజెండా ప్రకటిస్తే అది సాధ్యమవుతుంది. అలా ప్రజాదరణ చూరగొనకపోవడం వల్లే గడిచిన పలు దశాబ్ధాల్లో అనేక రాజకీయ ప్రయోగాలు విఫలమయ్యాయి. తెలంగాణలో వై.ఎస్.షర్మిల ప్రయోగం అటువంటిదే! షర్మిల, కవితల మధ్య కొన్ని వైరుధ్యాలున్నప్పటికీ సామ్యాలే ఎక్కువ! ఇంటిపోరుతో వీధుల్లోకి వచ్చారనే భావన జనంలో ఉంది. రాజకీయ అవకాశాలు, ఆర్థిక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ (పి.కె) సలహాలు ఇద్దరికీ ఉన్నాయంటారు.
అణగారిన సమూహాలు, అన్యాయానికి గురయ్యే వర్గాల తరపున పోరాడటానికి ఎవరి నాయకత్వ పాత్రకు అభ్యంతరాలుండవు కానీ, బాధిత వర్గాలవారికి ఉన్న ఆదరణ నేతలుగా ఇతరులకుండదు. ఉద్యమంగా తప్ప మందకృష్ణ మాదిగవంటి వారే రాజకీయంగా సఫలీకృతం కాలేదనే అభిప్రాయం జనాల్లో ఉంది. లోక్‌సత్తా సామాజిక వేదిక నేతగానే తప్ప జయప్రకాష్ నారాయణ రాజకీయంగా క్లిక్ అవలేదు. 2009లో చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం ప్రభంజనంలా వచ్చినా ఒక రాజకీయశక్తిగా నిలబడలేదు. ఆ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి పాలక కాంగ్రెస్‌కు ఉపయోగపడింది. రాజకీయ పక్షంగా కన్నా తటస్థ ‘పౌరసమాజ సంస్థ’గా ‘జాగృతి’కి ఆదరణ ఉంది. రేపు రాజకీయ పార్టీగా నిలబడాలంటే విస్తృత ప్రజావళిని మెప్పించే స్పష్టమైన ప్రత్యామ్నాయ సామాజిక, ఆర్థిక ఎజెండా అవసరం.
– దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.