Reading Time: 2 minutes

దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం శుక్రవారం మరింత ప్రజ్వరిల్లింది. ఐదో వా రం దాటిన ఈ దాడుల క్రమంలో ఇరాన్ ఇప్పుడు మధ్యప్రాచ్యంలోని పలు స్థావరాలపై విరుచుకుపడింది. ప్రత్యేకించి అ మెరికా స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణుల దాడులను ఉధృతం చేసింది. కువైట్‌లోని అత్యంత కీలకమైన మినా అ ల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై జరిగిన దాడులలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దేశ చమురు ఉత్పత్తిలో ఈ రిఫైనరీ అత్యంత ప్రధానమైనది. రోజువారిగా ఇక్కడ 3,64,000 బ్యారెల్స్ చమురు ఉత్పత్తి అవుతుంది. ఈ కర్మాగారం పనిచేయకపోతే కువైట్‌లోని వేలాది చమురు బావులలో ఉత్పత్తి అయ్యే ముడిచమురు శుద్ధి నిలిచిపోతుంది.

చర్చల అస్పష్టతను పెంచిన తరువాత అమెరికా, ఇజ్రాయెల్ సేనలు సం యుక్తంగా ఇరాన్‌లోని టెహరాన్ ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులతో విధ్వంసానికి దిగాయి. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన కరాజ్ వంతెన గురువారం నాటి అమెరికా దాడులలో పూర్తిగా దెబ్బతింది, కుప్పకూలింది. ఇరాన్ ప్రధాన సైనిక స్థావరాలను దెబ్బతీశామని అమెరికా అధ్యక్షులు ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ తమ దాడులతో ఏకకాలంలో అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్‌దేశాలపై శక్తివంతమైన దాడులు కొనసాగించింది. తమ బలాన్ని చాటింది.

శుక్రవారం ఉదయం కువైట్‌లోని అతి పెద్ద మినా అల్ అహ్మదీ రిఫైనరీపై భారీ స్థాయి దాడికి దిగింది. ఈ యుద్ధం దశలో ఇప్పటికే ఈ రిఫైనరీ పలుసార్లు ధ్వంసం అయింది. శుక్రవారం చెలరేగిన మంటలను ఆర్పేందుకు పెద్ద ఎత్తున అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఇరాన్‌కు చెందిన పలు డ్రోన్లను తాము ధ్వంసం చేసినట్లు సౌదీ భద్రతా వర్గాలు తెలిపాయి. సౌదీలోని అత్యంత కీలకమైన అమెరికా రాడార్‌ను ఇరాన్ దెబ్బతీసింది. యుఎఇలో భారీ స్థాయిలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకున్నారు. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో ఇరాన్‌లోని కీలకమైన ఇస్ఫహాన్ నగరం మరో సారి దెబ్బతింది. అయితే ఇక్కడ నష్టం వివరాలు తెలియలేదు. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన వంతెనలను , ఇతర నిర్మాణాలను లక్షంగా ఎంచుకుని దాడులు జరుపుతామని అమెరికా హెచ్చరించింది. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని చమురు స్థావరాలతో పాటు పలు పర్యాటక కేంద్రాలను , అక్కడి డ్యాంలను గురిచేసుకుని దాడులు చేస్తామని ప్రకటించింది.

ఇరాన్‌లో అమెరికా ఎఫ్ 35, ఎఫ్ 15 ఫైటర్స్ కూల్చివేత

ఎఫ్ 35 ఫైటర్ పైలట్ కిందికి దూకిన దృశ్యాలు

ఇరాన్ వాయవ్య ప్రాంతంలో అమెరికా అత్యంత శక్తివంతమైన ఎఫ్ 35, ఎఫ్ 15 యుద్ధ విమానాలతో దాడికి దిగింది. వీటిని తమ సేనలు విజయవంతంగా నేలకూల్చాయని ఇరాన్ తెలిపింది. చాలా దూరం వరకూ శకలాలు పడినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇక ఇక్కడ తమ దాడుల సందర్భంగా యుద్ధ విమాన పైలట్ ప్రత్యేక పారాచూట్‌తో కిందికి దూకినట్లు ఇరాన్ తెలిపింది. సంబంధిత ఫోటోతో కూడిన వీడియోను ఇరాన్ స్థానిక టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి. అయితే దీనిపై అమెరికా నుంచి ఎటువంటి స్పందనా వెలువడలేదు. దాడి జరిగిన ప్రాంతంలో ఆ తరువాత ఎవరికి అయినా శత్రుదేశ పైలట్ లేదా పైలట్టు కనిపిస్తే సజీవంగా పట్టుకుని తమకు అప్పగించాలని , భారీ నజరానా ఉంటుందని ఇరాన్‌లోని బాయెర్ అహ్మద్ ప్రాంతపు అధికారులు వీడియో సందేశం వెలువరించారు. పెంటగాన్‌లోని యుఎస్ సెంట్రల్ కమాండ్ వర్గాలు కానీ వైట్‌హౌస్ కానీ ఇరాన్ టీవీ ఛానల్ వార్తలపై ఎటువంటి స్పందనకు దిగలేదు.

హర్మూజ్‌పై భద్రతా మండలి కదలిక?

హర్మూజ్‌పై ఇరాన్ ఆధిపత్యం, ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకంపై ఐరాస భద్రతా మండలి సమీక్షిస్తుంది. ఈ దారిని తిరిగి తెరిపించే బాధ్యత తమకు ఉందని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటించారు. ఈ దశలో హర్మూజ్ వేదికగా పోరు తీవ్రతరం అవుతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా మండలి స్పందించింది. ఈ జలమార్గంలో నౌకల సురక్షిత ప్రయాణానికి వీలుకల్పించే తీర్మానం ఆమోదం పొందేలా మండలి సమావేశంలో సభ్యదేశాలు స్పందిస్తాయని వెల్లడైంది. బహరైన్ నుంచి ఈ మేరకు వెలువడ్డ ప్రతిపాదనపై చర్చకు రంగం సిద్ధం అయింది. ఈ మార్గం పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే రక్షణపరంగా కూడా చర్యకు దిగాలని కోరుతూ బహరైన్ ప్రతిపాదిత తీర్మానం నెగ్గితే ఈ మార్గంపై ఇప్పుడున్న పరిస్థితిలో కీలక కదలిక ఏర్పడుతుంది. అయితే బలప్రయోగానికి ఇరాన్ అనుకూలమైన వీటో దేశాలు రష్యా, చైనా తోడుగా ఫ్రాన్స్ కూడా వ్యతిరేకత తెలిపితీరుతాయని, వీటోను ప్రయోగిస్తాయని భావిస్తున్నారు.