Reading Time: < 1 minute

 కన్నబిడ్డలకు రక్షణగా ఉండాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆడపిల్లలు పుట్టారని గొడవల నేపథ్యంలో ఇద్దరు కవల కుమార్తెలను తండ్రి బావిలో ముంచి చంపడం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీనగర్‌కు చెందిన కచ్చు శ్రీశైలంకు ఆరేళ్ల క్రితం మానకొండూరు మండలం లక్ష్మీపూర్‌కు చెందిన మౌనికతో వివాహమైంది. వీరికి గీతాంశీ, గీతాన్విక (4) అనే ఇద్దరు కవలు జన్మించారు. అయితే, కొంతకాలంగా ఆడపిల్లలు పుట్టారనే కారణంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం శ్రీశైలం తన ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకొని పొలానికి వెళ్లాడు.

పొలానికి తీసుకువెళ్లిన పిల్లలను శ్రీశైలం కావాలనే బావిలో ముంచి చంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బావిలో గాలించగా గీతాంశీ మృతదేహం నీటిపై తేలింది. కాగా, మరో కుమార్తె గీతాన్విక ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు బావిలో, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ విజయ్‌కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. నిందితుడు శ్రీశైలంను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో జూబ్లీనగర్‌లో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉన్నందున, శాంతిభద్రతల దృష్ట్యా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ‘కుటుంబ గొడవల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు, గీతాన్విక ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది’ అని కరీంనగర్ రూరల్ సీఐ తెలిపారు.