
సైబరాబాద్ సహా, అమరావతి నిర్మాణం కోసం భగవంతుడు అవకాశాలు కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజధాని అంటే నాలుగు ఆఫీసులు కడితే సరిపోదని, అమరావతిలో నవ నగరాల అభివృద్ధికి రూపకల్పన చేశామన్నారు. అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.
గతంలో మూడు రాజధానులంటూ మూడుముక్కలాటలు ఆడారని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు ప్లాన్ -B అంటూ కొత్త వాదన తెస్తున్నారని ఎద్దేవా చేశారు. మావిగన్ అంటూ ఏవేవో చెబుతున్నారు.. మావిగన్ పేరు పలకడం కూడా కష్టంగా ఉందన్నారు చంద్రబాబు. దేశమంతా అమరావతిని నిలబెట్టేందుకు మద్దతిస్తే..
మన వాళ్లే మనకు ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై వైసీపీ విష ప్రచారం చేసిందన్నారు చంద్రబాబు. ఈ ప్రాంతాన్ని ఎడారి అని.. కులం రంగు పులిమారని ఆరోపించారు. అమరావతిపై బురదజల్లేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. భూములు ఇవ్వకుండా రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టినా.. 29వేల మంది రైతులు భూములు ఇచ్చారని గుర్తు చేశారు.
భవిష్యత్ తరాలు శాశ్వతంగా రాజధాని ప్రాంతాన్ని వినయోగించుకోవాలనే మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా భవనాలను కూడా నిర్మించేలా ప్రపంచ శ్రేణి ఆర్కిటెక్‌లను నియమించామని చంద్రబాబు తెలిపారు. నార్మన్ ఫోస్టర్స్ ద్వారా నగరాన్ని బ్లూ, గ్రీన్ సిటీగా, అధునాతన నగరంగా అమరావతిని తీర్చిదిద్దేలా ప్రణాలికలు చేశామన్నారు. రహదారులు, విద్యుత్ కోసం డక్ట్ లు, క్లీన్ అండ్ గ్రీన్ విధానంలో చేపట్టామని, ప్రజలు వాక్ టూ వర్క్ , ఎమర్జెన్సీ 5-10-15 నిముషాలు అనే విధానం నగర నిర్మాణంలో చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ తో ఒప్పందం చేసుకుంటే, సింగపూర్ పైన అబాండాలు వేసి ఒప్పందాలన్నీ రద్దు చేశారన్నారు. అమరావతి బ్రాండ్ ను కూడా దెబ్బతీశారని చంద్రబాబు మండిపడ్డారు.
1,307 ఎకరాలను 113 సంస్థలకు రాజధానిలో భూములు కేటాయిస్తే పనులు వేగంగ మొదలయ్యాయి. అయితే వేల మంది కార్మికులతో ముమ్మరంగా పనులు జరిగే సమయంలో వాటిని ఆపేశారన్నారు. మూడు రాజధానుల ప్రకటన చేసి.. మూడు ప్రాంతాల్లో వివాదం సృష్టించేలా ప్రయత్నించారని చంద్రబాబు విమర్శించారు. హైకోర్టు కూడా దీనిపై వారికి మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. అమరావతి రైతుల ఉద్యమానికి కౌంటర్ గా పెయిడ్ ఆర్టిస్టులతో క్యాంపులు పెట్టించారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కేసులు పెట్టించారు. దాడులకు సైతం తెగబడ్డారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వస్తే ముళ్లకంచెలతో అడ్డకున్నారన్నారు. కుట్రలను కుతంత్రాలను ప్రజలు విశ్వసించలేదు. మాకు మళ్లీ పట్టం కట్టారు. వారి రుణం తీర్చుకునేందుకు అమరావతిని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తొలి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. అందుకే ఈ తీర్మానం పెట్టి పార్లమెంటుకు పంపితే.. దానికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి అన్నారు. గత పాలకులు నిలిపేసిన అమరావతి నిర్మాణాలను మళ్లీ మేం అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ చేతుల మీదుగా రీస్టార్ట్ చేశామని తెలిపారు. లోక్ సభ, రాజ్యసభలో అమరావతికి చట్టబద్దతపై బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి కూడా దీనికి ఆమోద ముద్ర వేస్తారు.. గెజిట్ వస్తుంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. దేశానికి అమరావతి ప్రైడ్ గా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు గుండె, ఆత్మ అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..