Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: “మీ ఆరు గ్యారంటీలకే దిక్కు లేదు&కేరళం ప్రజలను రాష్ట్రానికి వచ్చి చూడమంటారా?” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేరళంలో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఆ రు గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే కేరళ ప్రజలు వచ్చి చూడాలని చెప్ప డం పూర్తిగా అసత్య ప్రచారం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

ఏ ఒక్క పథకం కూడా సమర్థవంతంగా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. అమలు చేయని పథకాలను అమలు చేసినట్టు చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. ఇది సాధారణ అబద్ధం కాదు, ప్రజలను మోసం చేసే ప్రయత్నం అని ఆయన దుయ్యబట్టారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారని, పెన్షన్లు రూ.2,000 నుంచి రూ.4,000 చేస్తామని, దివ్యాంగులకు 3,000 నుంచి రూ.6,000 చేస్తామని హామీ ఇచ్చారని, దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామన్నారని, బిసిలకు లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పారని, రెండు సంవత్సరాల్లో ఒక్క ఏడాది కూడా రూ.20,000 కోట్లు ఇవ్వలేకపోయామని కేరళ ప్రజలకు చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకపోవడం ఒక మోసం అయితే, అమలు చేశామని చెప్పడం మరింత పెద్ద మోసం, తప్పుడు ప్రచారం, అబద్ధాలు చెప్పడం ప్రజలను దగా చేయడమే అవుతుందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పెళ్లయిన ఆడ బిడ్డలకు తులం బంగారం ఎక్కడ? ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కడ? నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? ఈ హామీలన్నీ ఎక్కడికి పోయాయి? అయినా కూడా గ్యారెంటీలు అమలు చేశాం అని కేరళంలో రేవంత్ రెడ్డి చెప్పడం ఎంత పెద్ద మోసమో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ మాటలను నమ్మకండి. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కేరళం ప్రజలను మోసం చేశాయని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిని అడ్డుకున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అవినీతి మరింత పెరుగుతుందని ఆయన కేరళం ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణ నుంచి డబ్బులు పంపుతున్నారనే అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నాయన్నారు.

కెసిఆర్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా..

కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మోసగించినట్లే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మోసగిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కాం విషయంలో తాము పూర్తి స్థాయి దర్యాప్తు కోరుతున్నామని, ప్రభుత్వం కేవలం మేడిగడ్డ, కొన్ని పిల్లర్ల విషయంపై మాత్రమే మాట్లాడుతున్నదన్నారు. మొత్తం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.