
మన తెలంగాణ/హైదరాబాద్: హైటెక్ సిటీకి కూతవేటు దూ రంలో ఉన్న గోపాల్‌నగర్ యూఎల్‌సీ భూములపై భూ రాబందు ల కన్నుపడ్డది. వందల కోట్ల విలువైన ఈ భూములను హస్తగతం చేసుకోవడానికి గత కొన్నిరోజులుగా ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కూకట్‌పల్లి మండలం హైదర్‌నగర్ గ్రామ సర్వే నెంబర్ 148 నుంచి 155 వరకు సు మారు 10 ఎకరాల భూమి అప్పట్లో అర్బన్‌ల్యాండ్ సీలింగ్ కింద ప్రభుత్వం ప్రకటించింది. 1980 దశకంలో గోపాల్‌నగర్ కో ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ పేరుతో గ్రామ పంచాయతీ లే అవుట్‌తో ఏర్పడిన కాలనీలో భాగంగా మధ్యలో ఉన్న యూఎల్‌సీ భూముల్లో సైతం ప్లాట్లుగా చేసి విక్రయించారు. తెలిసో, తెలియకో చాలామంది సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందినవారు, చిరుద్యోగులు స్థలాలను కొనుగోలు చేశారు.
దీనిపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఈ సొసైటీలోని 130 ప్లాట్లు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కిందికి వస్తాయని పేర్కొంటూ నిర్మాణాలను నిలిపివేశారు. ఇక్కడ ఎలాంటి పనులు చేయకుండా బోర్డులు కూడా ఏర్పాటుచేశారు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి పాట్ల బాధితులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు ఉన్నత న్యాయస్థానం బాధితులకు వెసులుబాటు కల్పిస్తూ తీర్పును వెలువరించింది. ప్రభుత్వం దీనిపై అప్పీల్‌కు వెళ్లకపోవడంతో బాధితులకు కొంత ఊరట కలిగించినట్లయ్యింది. ఎప్పటికైనా ప్రభుత్వం యూఎల్‌సీ భూములను మార్కెట్ విలువ ప్రకారం తీసుకొని రిజిస్ట్రేషన్‌లు చేస్తుందన్న నమ్మకంతో ప్లాట్లలో చిన్నపాటి రూంలు నిర్మించి ఆదీనంలో ఉంచుకుంటూ వస్తున్నారు. అయితే, బాధితుల తరఫున న్యాయపోరాటం పేరుతో మాజీ సొసైటీ అధ్యక్షుడు తమ వద్ద నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
హైరైజ్డ్ బిల్డింగ్ పేరుతో నయా నాటకం
ప్రభుత్వ పెద్దలతో తమకు సత్సంబంధాలున్నాయని, యూఎల్‌సీ వివాదం, ఇతరత్రా ఖర్చులు తాము చేసుకుని హైరెజ్డ్ బిల్డింగ్‌ల నిర్మాణం చేసుకుంటామని చెప్తూ బాధిత ప్లాట్ల యజమానులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం గత ఏడాదిన్నర కాలంగా జరుగుతున్నది. ప్లాట్ల యజమానులు దీనికి ససేమిరా అనడంతో ప్లాట్ల వివాదాలు సృష్టించడం, వేరేవారితో ఫేక్ అగ్రిమెంట్లతో ప్లాట్లను కబ్జా చేయడానికి యత్నించడం.. వివాదాలు పోలీసుస్టేషన్‌లకు వెళ్తున్నాయి. దీంతో సహజంగానే ప్లాట్ల యజమానుల్లో భయబ్రాంతులకు గురిచేస్తూ, నిలదీసేవారిపై కేసులు నమోదు చేయడం జరుగుతున్నాయని బాధితులు తెలుపుతున్నారు.
కోట్ల విలువైన భూమిని అగ్గువకు కొట్టేసేందుకు యత్నం
హైటెక్‌సిటీ, –కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ రోడ్డు పక్కనే ఉన్న ఈ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో భూ మాఫియా బలవంతపు ఎంఓయూలకు సిద్ధమైంది. కోట్లాది రూపాయల విలువైన ఈ భూమిలో అభివృద్ధి చేసి హైరెజ్డ్ భవనాలు నిర్మిస్తామని, ఒప్పుకుంటే ప్లాటు ఇస్తామని చెప్పి లక్ష రూపాయలను చెక్కు రూపంలో ఒకరిద్దరు బాధిత ప్లాటు ఓనర్లకు ఇచ్చి ఎంఓయూలు చేసుకున్నారు. వీటిని మిగతా వారందరికి చూపిస్త్తూ ఇస్తే సరే సరి.. లేకుంటే హైడ్రా దిగుతుంది. ప్లాట్లలో పెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమి అని బోర్డు పడుద్దీ అని బెదింపులకు దిగుతున్నారు. మరోవైపు ఆదివారం (ఈ నెల 5) గోపాల్‌నగర్‌లో నిర్వహించే సమావేశానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఎంఓయూలపై సంతకాలు చేసి తాము ఇచ్చే లక్ష రూపాయల చెక్కును తీసుకెళ్లాలని పేర్కొంటూ వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టడం గమనార్హం.
దశాబ్దాలుగా కాని యూఎల్‌సీ క్లియరెన్స్‌లు ఎలా సాధ్యం?
వందల కోట్ల విలువైన యూఎల్‌సీ భూములను కొల్లగొట్టి వేల రూపాయలు సంపాదించే వ్యూహంలో భాగంగా కో ఆపరేటీవ్ సొసైటీ మాజీ అద్యక్షుడిని పావుగా చేసుకుని బడా రియల్ మాఫియా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. నలబై హైదర్‌నగర్ గ్రామ శివారు సర్వేనెంబర్లు కలిగిన జేఎన్‌టీయూ సమీపంలోని సాయినగర్, వసంత్‌నగర్, సీబీసీఐడీ కాలనీ, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కాలనీ, వసంత్‌నగర్ కాలనీ, భగతసింగ్ నగర్ కాలనీల్లో ఇప్పటికీ యూఎల్‌సీ భూములంటూ, ప్రభుత్వ భూములంటూ రిజిస్ట్రేషన్లు నిలివేశారు. దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లియరెన్స్‌లు రాలేదని, ప్రత్యేకంగా గోపాల్‌నగర్ యూఎల్‌సీ భూములకు ఎలా క్లియరెన్స్ తెస్తారో చెప్పకుండా తమకు ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని, స్థానిక ప్రజా ప్రతినిధులు తమకు
పూర్తి సహకారం అందిస్తున్నారని నమ్మబలుకుతూ నయా నాటకాన్ని తెరలేపి మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంఓయూల పేరుతో తమతో సంతకాలు చేయించుకుని తమను ముప్పుతిప్పలు పెట్టి వారు చెప్పిన ధరను తీసుకెని తమ ప్లాట్లు తమకు చెందకుండా చేసే వ్యవహారం చేస్తున్నారని, ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా అనేక వివాదాలు సృష్టించి తమను కేసుల పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఒక సామాజికవర్గం ప్రజా ప్రతినిధులు తెరవెనుక ఉండి భూ మాఫియా వారితో చేతులు కలిపి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. గోపాల్‌నగర్ యూఎల్‌సీ భూములపై వాలుతున్న భూ రాబందుల ఆగడాలను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.