Reading Time: 2 minutes
Carmeni Selvam Movie Review Samuthirakani Gvm Telugu Tamil

సముద్రఖని, గౌతమ్ మీనన్, అభినయ ప్రధాన పాత్రలలో రూపొందించిన తమిళ, తెలుగు బైలింగ్వల్ మూవీ ‘కార్మేని సెల్వం’. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ టైటిల్‌తో ఒక్కసారిగా ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుతో సహా తమిళంలో మంచి ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లోకి చేరువైన ఈ సినిమా, ఏప్రిల్ మూడవ తేదీన తెలుగులో ‘రాకాస’, ‘బైకర్’ సినిమాలతో పోటీగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ:
ఒక పెద్ద బిజినెస్‌మెన్ అయిన సంపత్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ ఉండే సెల్వం (సముద్రఖని) చాలా ప్రాక్టికల్. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా తన భార్య, కొడుకుతో కలిసి చెన్నైలో జీవిస్తూ ఉంటాడు. అయితే జీవితంలో ఎదురైన కొన్ని అవమానాలు అతన్ని అప్పుల వైపు నడిపించేలా చేస్తాయి. సమాజంలో ఎంతో గౌరవంగా బతికిన అతన్ని అప్పులు దారుణమైన స్థితిలోకి తీసుకువెళతాయి. ఈ నేపథ్యంలో సెల్వం జీవితం ఏమైంది? అప్పులు అంటే ఆమడ దూరం పరిగెత్తే అతను, అప్పులు చేసిన తరువాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి తన భార్య, కొడుకు కోసం ఏం చేశాడు? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
ఇది ఒక సినిమా కథ అనిపించదు; ప్రతిరోజు మన ఇళ్లలోనూ, మన ఇంటి పక్క వారి ఇళ్లలోనూ మనం అనునిత్యం చూసే కథే. నిజానికి ఈ క్రెడిట్ కార్డ్స్ లేదా అవసరానికి లోన్ తీసుకోమని వెంటపడే క్రెడిట్ యాప్స్ లేనంతవరకు సామాన్యుడి జీవితం సామాన్యంగానే ఉండేది. కానీ, ఇలా అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేసుకోవడం కోసమే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఎన్నో సంస్థలు, ఎంతోమంది సాధారణ వ్యక్తుల జీవితాలను నాశనం చేశాయి. అప్పులు తీసుకుని తిరిగి కట్టలేక లోన్ యాప్స్ వేధింపులకు గురై చనిపోయిన ఎన్నో దాఖలాలు మనం చూస్తూనే ఉంటాం.

అలా చుట్టుపక్కల వాళ్ళు ఆడంబరంగా బతుకుతున్నారని, వారిని చూసి వాతలు పెట్టుకుంటూ ఉండే ఒక కుటుంబం కథే ఈ సినిమా. వాస్తవానికి వారేమీ చెడ్డవారు కాదు; కానీ చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం, బంధువుల ప్రభావంతో లేని ఆడంబరాలకు పోయి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే అంశాన్ని చాలా హృద్యంగా తలకెక్కించారు. ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఫ్యామిలీస్, ముఖ్యంగా లేడీస్‌ని టచ్ చేసేలా ఉంది. వాస్తవానికి కుటుంబం ఎదగాలని ప్రతి ఇంట్లో మహిళ కోరుకుంటుంది, అందుకోసం ఆమె సైతం కష్టపడుతూ ఉంటుంది. కానీ పరిస్థితుల ప్రభావంతో, బంధుమిత్రుల ప్రభావంతో భర్త సంపాదన అనుకున్నంత లేదని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉండడంతో, సదరు భర్త ఏం చేసినా డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో అడ్డదారుల తొక్కడానికి సైతం వెనుకాడడం లేదు. సమాజంలో జరుగుతున్న ఇలాంటి విషయాలని చాలా హృద్యంగా, ఎలాంటి బూతులు, అనవసరమైన సన్నివేశాల జోలికి వెళ్లకుండా దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

ఈ రోజుల్లో బూతు కంటెంట్ లేకుండా సినిమాలు కరువైపోతున్న నేపథ్యంలో, అదేమీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని చూసి ప్రభావితం అయ్యేలా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు. నిజానికి ఈ సినిమాలో చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యాయి కానీ, ఎక్కడా ఎమోషన్స్ మిస్ అవ్వలేదు. ఒక తండ్రిగా కొడుకును ఆనందింపజేయాలనుకునే వ్యక్తి, సమాజంలో ఏం జరుగుతున్నా తనకు అనవసరం, తన ఫ్యామిలీయే ముఖ్యం అనుకుంటూ ఎలాంటి తప్పులు చేస్తున్నాడు? అప్పులకు దూరం పరిగెత్తే వాళ్లు సైతం చుట్టుపక్కల వాళ్లు, అలాగే బంధుమిత్రుల ప్రోద్బలానికి, ప్రభావానికి ఎలా గురవుతున్నారు? అనేది ఆసక్తికరంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

నటీనటుల ప్రతిభ: నటీనటుల విషయానికి వస్తే, సముద్రఖని ఎప్పటిలాగే తనదైన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఓ మధ్యతరగతి తండ్రిగా, భర్తగా తన వాళ్లను ముందుకు తీసుకువెళ్లే పాత్రలో జీవించాడు. గౌతమ్ మీనన్ పాత్ర చిన్నదైనా ప్రభావం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అభినయ పాత్ర చాలా చిన్నది కానీ సినిమా మొత్తం ఆమె ప్రభావం ఉంటుంది. అదేవిధంగా సముద్రఖని భార్య పాత్రలో నటించిన లక్ష్మి చాలా సీన్స్‌లో చాలా పరిణతితో నటించింది. ఇక సముద్రఖని కుమారుడి పాత్రలో నటించిన బుడతడు సైతం ఆకట్టుకున్నాడు.

సాంకేతిక విభాగం: సాంకేతిక టీం విషయానికి వస్తే, ఈ సినిమా దర్శకుడికి ఇది మొదటి సినిమా లాగా ఏమాత్రం అనిపించలేదు. శేఖర్ కమ్ముల దగ్గర గతంలో పనిచేసిన సదరు దర్శకుడు, డైలాగ్స్ విషయంలో కూడా శేఖర్ కమ్ములను బాగా ఫాలో అయినట్లు అనిపించింది; చాలా చోట్ల ఆలోచింపజేసేలా డైలాగ్స్ ఉన్నాయి. నాన్-లీనియర్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా కథ చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాను ఎలివేట్ చేస్తుంది. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకునేలా ఉందని చెప్పక తప్పదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ వర్డిక్ట్: ‘కార్మేని సెల్వం’ ఇది ప్రతి ఇంటా జరిగే కథే. ఒకసారి కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా.