హిట్టింగ్‌కి పెట్టింది పేరు రోహిత్ శర్మ. బంతి బ్యాట్ మీదకు వచ్చిందంటే చాలు.. అది కచ్చితంగా బౌండరీ దాటాల్సిందే. టీమిండియా డాషింగ్ ఓపెనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హిట్‌మ్యాన్.. క్రికెట్లో అనేక రికార్డులు నెలకొల్పాడు. కెరీర్ ఆరంభంలో కొంత తడబడిన ఈ ముంబై క్రికెటర్ అనంతరం తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టులో పాతుకుపోయాడు. అసాధ్యమైన ఘనతలను సాధించి మరెవరూ చేరుకోలేని రికార్డులను నెలకొల్పాడు. ముఖ్యంగా తన 13 ఏళ్ల కెరీర్లో హిట్‌మ్యాన్ నెలకొల్పిన అసాధ్యమైన రికార్డులను చేరుకోవడం ఎవరితరం కాదు.
అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ శర్మ 264 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 2014 నవంబర్ 13న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అప్పటికే భారత్ తరపున వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌తో రెండో డబుల్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సేహ్వాగ్.. రోహిత్ శర్మ కన్నా ముందే డబుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. అయితే శ్రీలంక మ్యాచ్‌లో 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో మిగతా 164 పరుగులు కేవలం 73 బంతుల్లోనే నమోదయ్యాయి. 33 బౌండరీలు, 9 సిక్సర్లతో వీరవిహారం చేయడంతో భారత్ 404 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్ లభించింది. ఆ అవకాశాన్ని అందుకున్న రోహిత్ శర్మ మరెవరికీ సాధ్యం కాని దరిదాపుల్లో రాని రికార్డును తన పేరిట లిఖించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన ఆటగాడు. తన సారధ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు మొత్తం నాలుగు టైటిల్స్ అందించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ ప్లేయర్‌గా ఐదు టైటిల్స్ అందుకున్న ఘనతను రోహిత్ శర్మ అందుకున్నాడు. ఇక 2009లో డెక్కన్ ఛార్జస్ ప్లేయర్‌గా తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన రోహిత్ శర్మ.. 2011లో ముంబై ఇండియన్స్ జట్టుతో చేరాడు. ఆ జట్టు సారధిగా 2013, 2015 అలాగే 2017, 2019 సీజన్లలో టైటిల్స్ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఐదు ట్రోఫీలు అందుకున్న ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లోకి ఎక్కాడు. యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, అంబటి రాయుడు ముగ్గురు ప్లేయర్లే నాలుగు ఐపీఎల్ టైటిల్స్ అందుకున్నారు.
అంతర్జాతీయ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. చివరిసారిగా 2017లో శ్రీలంకపై రెండోసారి డబుల్ సెంచరీ చేసిన హిట్ మ్యాన్ 2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులతో.. అలాగే 2014లో శ్రీలంకపై 264 పరుగులు చేశాడు. దీంతో మరెవరికీ సాధ్యం కానీ మూడు డబుల్ సెంచరీల రికార్డును తన పేరిట లిఖించాడు. ఈ రికార్డును అధిగమించడం ప్రస్తుత తరంలో పాటు రాబోయే తరానికి కూడా కష్టమే.
2011 వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోవడం తన కెరీర్లో అత్యంతగా బాధపడిన సందర్భం అని చెప్పిన రోహిత్ శర్మ.. 2019లో జరిగిన ప్రపంచకప్‌లో మాత్రం తన కసిని బంతిపై తీర్చుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లో తనదైన శైలిలో చెలరేగుతూ భారత్ సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ 81 సగటుతో 5 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 648 పరుగులు చేశాడు. అయితే ఒక వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధికంగా ఐదు సెంచరీలు సాధించిన రికార్డును మాత్రం రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు. తన రెండు వరల్డ్‌కప్‌లలో మొత్తం ఆరు సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండూల్కర్ ఆరు సెంచరీలతో సమంగా నిలిచాడు. సచిన్ 44 ఇన్నింగ్స్‌లో ఆరు సెంచరీలు చేయగా.. రోహిత్ శర్మ కేవలం 16 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను అందుకున్నాడు.
తన విధ్వంసకర బ్యాటింగ్‌కు సరిగ్గా సరిపోయే ధనాధన్ టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2007లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన హిట్ మ్యాన్ 100 టీ20లో 140 స్ట్రైక్ రేటుతో 2773 పరుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలు ఉన్నాయి. అయితే టీ20ల్లో నాలుగు సెంచరీలతో అత్యధిక శతకాలు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. రోహిత్ శర్మ తర్వాత గ్లెన్ మాక్స్వెల్, కోలీన్ మున్రో మూడు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక భారత్ నుంచి కేఎల్ రాహుల్ ఒక్కడే రెండు శతకాలు బాదాడు.





