
ఉలాన్‌బాటర్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా స్టార్ బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ పతక పంచ్ విసిరింది. డబుల్ వరల్డ్ చాంపియన్ నిఖత్ పాటు ప్రియ, ప్రీతి పవార్ సెమీఫైనల్ చేరడంతో ఈ మెగా టోర్నీలో ఇండియా మూడు మెడల్స్ ఖాయం అయ్యాయి. శుక్రవారం జరిగిన విమెన్స్ 51 కేజీ కేటగిరీ క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో నిఖత్.. ఫిలిప్పీన్స్‌కు చెందిన జియాన్ బగుహిన్ను చిత్తుగా ఓడించింది. ఆట మొదలైన వెంటనే తెలంగాణ బాక్సర్ పవర్ ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడింది. ఆమె ముందు జియాన్ ఏమాత్రం నిలువలేకపోయింది. దాంతో రిఫరీ తొలి రౌండ్‌లోనే ఆటను ఆపేసి నిఖత్‌ను విన్నర్‌గా ప్రకటించారు.
సెమీస్‌లో ఆమె పారిస్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ వు యు (చైనా)తో తలపడనుంది. మరోవైపు 60 కేజీ క్వార్టర్ ఫైనల్లో ప్రియ 4–-1 తేడాతో చైనా బాక్సర్ చెంగ్యూ యాంగ్‌ను ఓడించగా.. 54 కేజీ కేటగిరీలో వరల్డ్ బాక్సింగ్ కప్ విన్నర్ ప్రీతి పవార్ 5–-0తో ముంగున్‌సెట్‌సెంగ్ (మంగోలియా)ను చిత్తు చేసింది. సెమీఫైనల్లో ప్రియ.. మంగోలియా బాక్సర్ నమున్ మొంఖోర్‌తో, ప్రీతి.. కొరియా బాక్సర్ ఇమ్ ఏజీతో పోటీపడనున్నారు. కాగా, మెన్స్70 కేజీల క్వార్టర్స్‌లో దీపక్ 1–-4తో జెయాద్ ఈషాష్ (జోర్డాన్) చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టాడు.