
మనతెలంగాణ/హైదరాబాద్: యూడిఎఫ్ ప్రకటించిన గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వారు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రత్యక్షంగా చూసి తమ ట్రాక్ రికార్డు పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. కేరళం ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఆయన మంత్రులు తెలంగాణకు వస్తే తాము గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో ప్రత్యక్షంగా చూపుతామని సిఎం తెలిపారు. కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి యూడిఎఫ్ మేనిఫెస్టోను కొచ్చిలో గురువారం సిఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళంలో పినరాయి విజయన్ హయాంలో ముగిసిందని, ఇక యూడిఎఫ్ స్వర్ణయుగం మొదలవుతుందన్నారు.
మోడీ బ్రదర్స్… పినరాయి.. కెసిఆర్‌ల మధ్య పోలికలు..
ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశాన్ని, కేరళంను మోడీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోడీ విజయన్‌ను ఉద్దేశించి సిఎం వ్యాఖ్యానించారు. దేవుడి సొంత రాష్ట్రంలో దేవుడి ఆస్తికి రక్షణ లేదంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని సిఎం లేవనెత్తారు. కేరళంలో గత పదేళ్లుగా పినరాయి విజయన్ ప్రభుత్వం కొనసాగుతోందని, అలాగే, 2014 నుంచి సుమారు పదేళ్ల పాటు కెసిఆర్ తెలంగాణను పాలించారన్నారు. పినరాయి కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరాయి విజయన్, కెసిఆర్‌ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 2023లో తెలంగాణలో మాదిరి మార్పే ఈసారి కేరళంలో చోటుచేసుకుంటుందని సిఎం అన్నారు. పినరాయి విజయ్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
యూడిఎఫ్ కార్మికుల కూటమి
పో మోనే విజయా వ్యాఖ్యపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయన్ తమకు రాజకీయ ప్రత్యర్థి అని, మోడీలా మాట్లాడటం తనకు సాధ్యం కాదని, విమర్శించకుండా ఉండటం తన స్వభావం కాదని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అవినీతి నియంత్రణ, ఆదాయానికి గండిపెట్టే అంశాలను నియంత్రించడం, కేంద్ర పథకాల గరిష్ట వినియోగం, రాష్ట్రానికి రావలసిన నిధుల సాధన తమ ప్రాధాన్య అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరుణ కాదని అది ప్రజల హక్కు అనే విషయం ప్రజలకు తెలియజేస్తామని సిఎం తెలిపారు. యూడిఎఫ్ కార్మికుల కూటమి అని, కూటమిలో నిజాయితీగల నాయకులు ఉన్నారని సిఎం వ్యాఖ్యానించారు.
ఆర్టీసిని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చాం
కేరళంలో యూడిఎఫ్ గ్యారంటీలు అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందజేస్తున్నామని సిఎం తెలిపారు. 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతో పాటు ప్రజల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామని సిఎం వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 10 వేల బస్సులు, 50 వేల సిబ్బందితో ఉన్న ఆర్టీసిని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని సిఎం తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతోందన్నారు.
తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతం
200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళలను బస్సుల యజమా నులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ -2047 ప్రకారం తెలం గాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుపనున్నామని సిఎం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కెపిసిసి ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కేరళ సిఎల్పీ నేత వి.డి.సతీషన్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీప్‌దాస్ మున్షీ, యూడిఎఫ్ కన్వీనర్ ఆదూర్ ప్రకాష్, ఐయూఎంఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.కె.కున్హాలికుట్టి తదితరులు పాల్గొన్నారు.
కేరళంలో ఇందిరా గ్యారంటీలు ఇలా…
‘కేరళ గెలుస్తుంది – యూడిఎఫ్ నడిపిస్తుంది’ అనే నినాదంతో ‘ఇందిర గ్యారంటీ’ పేరుతో పలు ఆకర్షణీయమైన పథకాలను తమ ఎన్నికల హామీలుగా యూడిఎఫ్ ప్రకటించింది.
1.కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలోని ఇందిరా ఐదు గ్యారంటీలు
2.కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్పొరేషన్ (కెఎస్‌ఆర్టీసీ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
3.కాలేజీ చదువుతున్న బాలికలకు నెలకు రూ.1,000 ఆర్థిక సహాయం సంక్షేమ పింఛన్లు నెలకు రూ.3 వేలకు పెంపు
4.మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
5.యువతకు స్వయం ఉపాధి కోసం ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
6.ఐదు గ్యారంటీలతో పాటు సముద్ర, విమానయాన రంగాలకు సంబంధించి ఐదు డ్రీమ్ ప్రాజెక్టులు, వయనాడ్‌లో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు తదితర వాగ్దానాలు ఉన్నాయి.