Reading Time: 2 minutes

మన తెలంగాణ/ సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలోని బడంగ్‌పేట్ మున్సిపల్ సర్కిల్‌లో ఓ కాంట్రాక్టర్‌కు చెందిన 6 ఏజెన్సీల పేరిట డిప్యూటీ కమిషనర్‌తో పాటు మరో 9 మంది అధికారులు జరిపిన అవినీతి విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. ఒకే కాంట్రాక్టర్‌కు చెందిన ఏజెన్సీల ద్వారా సుమారు రూ.122 కోట్ల వరకు అవినీతికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బడంగ్‌పేట్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌తో పాటు మరో 9 మంది ఇతర అధికారులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ సస్పెండ్ చేశారు. ఒక బడంగ్‌పేట్ మున్సిపల్ సర్కిల్‌లోనే సుమారు రూ.122 కోట్ల మేర నియమాలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపులు జరిగితే, ఇక శివారులోని మిగతా మున్సిపల్ సర్కిల్‌లో అవినీతి పరిస్థితి ఏ మేరకు ఉంటుందోనని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.

నిధుల కోసమే పనులు..

న్యూస్ పేపర్ బిల్లు, టీస్నాక్స్, వాటర్ బాటిల్స్, డ్రైఫ్రూట్స్, గ్రామసభల ఏర్పాట్లు, క్లీనింగ్, మొక్కలకు రంగులు వేయడం, కంప్యూటర్‌లు, ప్రింటర్‌ల వంటి సుమారు 234 పనులను చేపట్టి కోట్లాది రూపాయలను స్వాహా చేశారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. 2024, 2025, 2026లలో శానిటేషన్ పనుల పేరిటనే కాకుండా టెండర్ నిబంధనల అడ్డును తొలగించేందుకు పనులను విభజించి నామినేషన్ కేటగిరిలోకి పనులను తీసుకొచ్చి పనులు చేయించడం, మున్సిపల్ జనరల్ ఫండ్స్‌ను మళ్లించేందుకు నకిలీ ఫైళ్ళను సృష్టించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు.

అవినీతి కోసమే మళ్లీ అక్కడికి..

2022 నుంచి బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగం జరుగుతూ వస్తోందనేది అధికారులు గుర్తించారు. బడంగ్‌పేట్ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో మున్సిపల్ సర్కిల్16గా ఉన్నది. బడంగ్‌పేట్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న రఘు, అనంతరం కమిషనర్‌గా వచ్చిన ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ సరస్వతి ఇతర అధికారులతో కలిసి సుమారు రూ.122 కోట్ల వరకు అవినీతికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. జీహెచ్‌ఎంసీలో బడంగ్‌పేట్ కార్పొరేషన్ విలీనమైనప్పుడు కమిషనర్‌గా ఉన్న సరస్వతి.. జీహెచ్‌ఎంసీలో అడ్మిన్ జాయింట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అనంతరం మళ్లీ బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు.

కుమ్మక్కు..

బడంగ్‌పేట్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న సరస్వతికి ఒక కాంట్రాక్టర్ తోడై.. ప్రభుత్వ నిధులను స్వాహా చేసేందుకు టెండర్ పిలవకుండా పనులను కేటాయించే విధానానికి తెరలేపారనేది ప్రధాన ఆరోపణ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పనులను విభజించినట్టు అధికారులు గుర్తించారు. నామినేషన్ వర్క్‌ల పేరిట, మరో అడుగు ముందుకేసి టెండర్ పిలిచిన పనికంటే.. అదనంగా పని జరిగిందంటూ బిల్లులు పెడుతూ.. వాటికి చెల్లింపులు జరుపుతూ కమిషనర్‌లు సరస్వతి, రఘు, జ్యోతిరెడ్డి, వెంకన్న, యాదయ్య, వినీల్ కుమార్ గౌడ్, యాదగిరి, శ్రీధర్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, వెంకట్‌లు కలిసి ఏకంగా రూ.122 కోట్ల మేర నిధుల దుర్వినియోగం చేశారనేది విచారణలో తేలినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

తెరవెనుక ఉన్నతాధికారులు..?

బడంగ్‌పేట్ అవినీతి బాగోతం వెనుక ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారనేది చర్చకు తెరలేచింది. అధికారుల అండదండలతోనే భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ అవినీతి తంతు జరిగినా కేవలం ఆ సర్కిల్ అధికారులపైనే చర్యలు తీసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.