
టాలీవుడ్ నటి హేమకు డ్రగ్స్ కేసులో బెంగుళూరు కోర్టుక్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా సంచలన వీడియో పోస్ట్ చేశారు హేమ. ,మళ్ళీ పబ్ కి వచ్చాను.. డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందంటూ హేమ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం ( ఏప్రిల్ 3 ) హైదరాబాద్ లోని ఓ పబ్ కి వెళ్లిన హేమ… పబ్ ప్రాంగణం నుంచే వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
మళ్ళీ పబ్ కి వచ్చాను.. ఇప్పుడే ఈగల్ టీం వాళ్ళు చేసిన డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందంటూ తన యూరిన్ టెస్ట్ రిపోర్ట్ చూపిస్తూ వీడియో షేర్ చేశారు హేమ. మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదని.. రేపు మళ్ళీ టెస్ట్ డ్రగ్స్ టెస్ట్ కి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తానంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో పేర్కొన్నారు హేమ.
ఇదిలా ఉండగా.. ఇటీవల బెంగుళూరు కోర్టులో తనకు క్లీన్ చిట్ వచ్చిన క్రమంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది హేమ. తనపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన సమయంలో పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయో చెబుతూ, తాను పూర్తిగా కుంగిపోయి జీవితం పట్ల నిరాశకు లోనయ్యానని పేర్కొన్నారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటపడ్డానని స్పష్టం చేశారు.
డ్రగ్స్ కేసు సమయంలో కొన్ని మీడియా సంస్థలు నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీశాయని హేమ ఆరోపించారు. ఆ వార్తల ప్రభావం తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబంపై కూడా తీవ్రంగా పడిందని, తమ కుటుంబం ఎంతో కష్టకాలాన్ని ఎదుర్కొందని చెప్పారు.