
రండి బాబూ రండి.. లోన్ ఇస్తాం ఇల్లు కొనుక్కోండి.. మీ దగ్గర డబ్బులు లేవా డోంట్ వర్రీ మేం అప్పు ఇస్తాం.. ఎన్ని లక్షలు కావాలి.. ఎన్ని కోట్లు కావాలి.. వడ్డీ చాలా చాలా తక్కువ.. మీరు అలా అప్లయ్ చేస్తే.. 48 గంటల్లో ఇలా అప్రూవ్ అవుతుంది.. సొంతింటి కలను మా బ్యాంక్ అప్పుతో తీర్చుకోండి.. తిరిగి ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు.. నెల నెలా 20, 25, 30 ఏళ్లపాటు తీరిగ్గా కట్టొచ్చు.. ప్రతినెలా అద్దె ఇంటికి అద్దె కడుతున్నట్లు మీ సొంతింటికి.. మా బ్యాంక్ EMI కట్టండి.. ఇదీ బ్యాంకుల మార్కెటింగ్. ఇలాంటి వలలో చిక్కకుండా.. బ్యాంక్ అప్పుతో సొంత ప్లాట్ తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను.. మంచి పని చేశాను అంటున్నాడు ఉద్యోగం పోయిన ఓ ఐటీ ఉద్యోగి.. ఉద్యోగం కోల్పోయిన ఐటీ ఉద్యోగి.. సోషల్ మీడియాలో పంచుతున్న తన అనుభవాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాలు ఏంటో తెలుసుకుందామా…
బెంగళూరు సిలికాన్ వ్యాలీలో ఉద్యోగం పోయిందంటే ఎవరికైనా గుండె ఆగినంత పని అవుతుంది. ఒక టెక్కీ మాత్రం తన ఉద్యోగం ఊడినా సరే.. ఎంతో ప్రశాంతంగా, పైగా సంతోషంగా ఉన్నానంటూ రెడ్డిట్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కోట్లలో ఆస్తులు, విలాసవంతమైన ఇల్లు కొనే స్తోమత అతనికి ఉన్నప్పటికీ.. తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం సంక్షోభం నుంచి రక్షించిందని అంటున్నాడు జాబ్ పోగొట్టుకున్న ఆ టెక్కీ.
గత ఏడాది బెంగళూరులో రూ.2 కోట్ల విలువైన 3BHK ఫ్లాట్ కొనాలని అనుకున్నాడు సదరు టెక్కీ. అతని నెట్ వర్త్ కూడా అందుకు సరిపోతుంది. అయితే అతను పనిచేస్తున్న ఏఐ విభాగం భవిష్యత్తులో ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ముందే పసిగట్టాడు. భారీ EMIల ఉచ్చులో చిక్కుకునే కంటే.. ఆఫీస్ దగ్గరే అద్దెకు ఇల్లు తీసుకుని ఉండటం మేలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఊహించినట్టే గత వారం కంపెనీ అతన్ని లేఆఫ్ చేసింది. ఉద్యోగం పోయినా తల పైన ఈఎంఐ భారం లేకపోవడంతో.. ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా తన తర్వాతి కెరీర్ ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఈ స్టోరీ బయటకు రావడంతో మరికొందరు టెక్కీలు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. బెంగళూరు లాంటి నగరాల్లో 70-80 శాతం మంది ఐటీ ఉద్యోగులు కేవలం స్థిరమైన ఆదాయం ఉంటుందనే నమ్మకంతో భారీగా హోమ్ లోన్స్ తీసుకుంటున్నారు. అయితే ఏఐ ప్రమాదం, ప్రపంచ రాజకీయ పరిణామాల మధ్య ఏ క్షణంలోనైనా జాబ్ పోయే ప్రమాదం ఉంది. తాను కూడా ఇల్లు కొనే ఆలోచన వరకూ వచ్చి ఆగిపోయానని, ఇప్పుడు లేఆఫ్స్ చూస్తుంటే అప్పట్లో తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తోందంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు.. బెంగళూరు నగరంలో పెరుగుతున్న ఇళ్ల ధరలు, అక్కడి మౌలిక సదుపాయాల మధ్య పొంతన లేదని కూడా చర్చ జరుగుతోంది. ట్రాఫిక్ సమస్యలు, నీటి కొరత ఉన్నా బిల్డర్లు మాత్రం కృత్రిమంగా డిమాండ్ సృష్టిస్తున్నారని కొందరు హోమ్ బయ్యర్లు ఆరోపిస్తున్నారు. అన్నీ అమ్ముడైపోయాయంటూ భ్రమ కలిగించి.. బ్రోకర్ల ద్వారా రేట్లు పెంచి రియల్టర్లు అమ్ముకుంటూ లాభపడుతున్నారని కొందరు యూజర్లు వాపోతున్నారు. సొంత ఇల్లు అనే ఎమోషన్ వల్ల చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఈఎంఐల ఉచ్చులో చిక్కుకుని సేవింగ్స్ లేకుండా నానా కష్టాలు పడుతున్నారని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. సొంత ఇల్లు ఉన్నా అనవసరంగా మళ్లీ కొత్త ఇళ్లు కొనేవారు పెరగటం కూడా మార్కెట్లో అపార్ట్మెంట్ల ధరలను ఊహలకు కూడా అందనంతగా పెంచేస్తున్నాయని అంటున్నారు.