
మేడిపల్లి: ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ ఓ బాలుడు ఉరేసుకొని చనిపోయిన సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ లోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఓ ప్రైవేటు ఉద్యోగి నివసిస్తున్నాడు. అతడి కుమారుడు(17) ఐటిఐ కాలేజీలో చదువుతున్నాడు. మేడిపల్లిలోని ఓ కార్ల షోరూమ్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో ఉన్నాడు. ఈ నెల 5న తల్లిదండ్రులు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఇంట్లో బాలుడు ఒంటరిగా ఉన్నాడు. తన ప్రియురాలుకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానిన బెదిరించాడు. ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. వెంటనే యువతి అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చింది. వెంటనే వారు ఇంటికి వెళ్లి డోర్ బలవంతంగా ఓపెన్ చేశారు. అనంతరం అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.