
తెలంగాణ రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేయబడింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం (TGDPS) లెక్కల ప్రకారం ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. నిన్న గురువారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 40.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక హైదరాబాద్ నగరంలో హిమాయత్‌నగర్, షేక్‌పేట్ ప్రాంతాల్లో 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఏప్రిల్ 7 వరకు హైదరాబాద్ నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్.బి. నగర్, సికింద్రాబాద్ వంటి ప్రధాన ప్రాంతాలలో ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 6న నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా ప్రయాణాలు చేసే వారు వాతావరణ పరిస్థితులను బట్టి తమ ప్లాన్లను మార్చుకోవాలని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.