
అమరావతి: ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురును తండ్రి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చంద్ర శీను, గంగ అనే దంపతులు మాచర్లలో జీవిస్తున్నాడు. ఈ దంపతులకు చౌడేశ్వరి(22), కుమారుడు ఉన్నాడు. జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజుతో చౌడేశ్వరికి పరిచయం ఉండడంతో ప్రేమగా మారింది. తన కూతురును ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చంద్రశీను నిర్ణయం తీసుకున్నాడు. రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉందనగా చౌడేశ్వరిని ప్రేమించిన నాగరాజుతో వెళ్లిపోయింది. దీంతో తన ఇంట్లో బంగారం తీసుకొని కూతురు పారిపోయిందని స్థానిక పోలీస స్టేషన్‌లో చంద్రశ్రీను ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి కూతురు, నాగరాజును పిఎస్‌కు తీసుకొచ్చారు. కట్టుబట్టలతోనే బయటకు వచ్చామని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లలేదని తెలిపారు. ఐదు రోజులు పుట్టింట్లో ఉండి తరువాత భర్త వద్దకు వెళ్లేలా ఒప్పందం రాసుకున్నారు. మార్చి 19న భర్త ఇంటికి వెళ్లాల్సి ఉండగా మార్చి 18న ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం తెలిపింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్షలో ఆమె ఊపిరాడక చనిపోయిందని తేలడంతో తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తన మేనల్లుడు పచ్చిపాల శ్రీనుతో కలిసి యువతి ముఖంపై దిండు అదిమిపెట్టి చంపేశారు. ప్రేమ పెళ్లి చేసుకుందని కోపంతో తన కూతురు చంపానని వివరించారు.