
మూసీ నదిని పూర్తిగా శుద్ధి చేయకుండా ఆలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణం చేపట్టడం సముచితం కాదని ఎఫ్‌జీజీ( ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ) అభిప్రాయపడింది. ముఖ్యంగా మూసీ మధ్యలో 108 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపింది. . కాలుష్య కోరల్లో చిక్కుకున్న నదిలో పరమశివుడి విగ్రహం ఏర్పాటు కరెక్ట్ కాదని సంస్థ స్పష్టం చేసింది.
2001 నుంచే మూసీ కాలుష్య నిర్మూలనకు ఎన్నో ప్రణాళికలు రూపొందించినా.. అడుగు ముందుకు పడలేదు. గతంలో 405 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆశించిన పురోగతి కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు హైకోర్టు సమీపంలో 50 కోట్ల వ్యయంతో నిర్మించిన రబ్బర్ డ్యామ్ కూడా ఎలాంటి ప్రయోజనం లేక తొలగించాల్సి రావడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని ఎఫ్‌జీజీ గుర్తుచేసింది.2012లో రూ. 17,130 కోట్లతో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. 2017లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన MRDCL (Musi Riverfront Development Corporation) ద్వారా కూడా స్పష్టమైన ఫలితాలు రాలేదని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
►ALSO READ | హైదరాబాద్ లో ఏప్రిల్ 5న ..ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
నిరంతర ఆక్రమణలు, శుద్ధి చేయని మురుగు నీరు, ముఖ్యంగా ఫార్మా పరిశ్రమల నుంచి వస్తున్న విషతుల్య వ్యర్థాలతో మూసీ ఒక పెద్ద డ్రైనేజీగా మారిపోయింది. అందుకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) సైతం మూసీని అత్యంత కాలుష్యగ్రస్త ప్రాంతంగా గుర్తించింది. ఆడంబరాలకు పోకుండా, నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడమే మొదటి ప్రాధాన్యత కావాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేసింది