Reading Time: < 1 minute

వివిధ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు నిర్విరామంగా నిరసనలు వ్యక్తం చేయడంతో శుక్రవారం నాడు లోక్ సభ కార్యకలాపాలు శనివారం నాటికి వాయిదా పడ్డాయి.ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టినా.. నేడు వరుసగా రెండోరోజున కూడా చర్చ జరగలేదు. ఉదయం నిరసనల మధ్య సభ వాయిదా పడి, మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యుల నిరసనలు కొనసాగాయి. స్పీకర్ వేదిక వద్దకు దూసుకువచ్చి నినాదాలు చేశారు. స్పీకర్ స్థానంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెన్నేటి కృష్ణ ప్రసాద్ ప్రతిపక్ష సభ్యులను వారివారి స్థానాల్లో కూర్చుని, ప్లకార్డులు ప్రదర్శించుకోవచ్చని అన్నారు. అయినా, సభ్యుల తమ ఆందోళనను విరమించలేదు. దీంతో కృష్ణప్రసాద్ సమావేశాలను సోమవారం ఉదయం వరకూ వాయిదా వేశారు. అంతకుముందు ప్రతిపక్షాల నిరసనలు, నినాదాలతో విసిగిపోయిన స్పీకర్ ఓం బిర్లా తాను ఇలాంటి సభను నిర్వహించలేనని వాపోయారు. అంతరాయం కారణంగా బడ్జెట్ సమావేశాలలో ఇంతవరకూ 19 గంటల 12 నిముషాలు వృథా అయ్యాయని స్పీకర్ పేర్కొన్నారు. సభ్యులు సభను అగౌరవపరచడం సబబుకాదని హితవు చెప్పారు.

శుక్రవారం సభసమావేశం అయిన వెంటనే ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, వెల్ లోకి దూసుకువచ్చారు. వారిని వారిస్తూ స్పీకర్ … ప్రజాసమస్యలను లేవనెత్తేందుకు ప్రజలు సభ్యులను ఎన్నుకున్నారని, సభ సజావుగా సాగాలని తాను కోరుతున్నానని, అందువల్ల సభ్యులు నినాదాలు మాని, సభా కార్యక్రమాలు జరిగేలా సహకరించారని విజ్ఞప్తి చేశారు.మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే రాసిన ప్రచురితంకాని జ్ఞాపకాలు ఆధారంగా రాసిన కథనాన్ని సభలో చదివి వినిపించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నించగా సోమవారం స్పీకర్ అందుకు నుమతించకపోవడంతో సభలో గందరగోళం మొదలైంది. ఆనాటి నుంచి ప్రతిపక్షాల నిరసనల కారణంగా సభ సజావుగా సాగలేదు. సభను సజావుగా నిర్వహించేందుకు అనుమతించాలని, నిరసన తెలుపుతున్న సభ్యులను స్పీకర్ కోరారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని ఓ ప్రశ్న వేయదలచినట్లు తెలిపారు. కానీ, సభ్యుల నిరసన ఆగలేదు. ప్రభుత్వం, ప్రతిపక్షం వివిధ అంశాలపై విభేదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపీల నిరసనల కారణంగా రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ప్రసంగించకుండానే లోక్ సభ ఆమోదించడం అపూర్వమైన పరిణామం.