
టీ కొట్టులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఉప్పల్‌లో శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 730 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…ఉప్పల్ హెడ్ పొస్టు ఆఫీస్ ఎదురుగా టీ కొట్టు వద్ద ఓ వ్యక్తి టీ కొట్టు పెట్టాడు, దానిలో పనిచేసేందుకు నారాయణఖేడ్‌కు చెందిన ఉద్యానాథ్‌ను పనికి పెట్టుకున్నాడు. టీ కొట్టు యజమాని ఇచ్చె జీతం తక్కువ రావడంతో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి టీ కొట్టు వద్దకు వచ్చే వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. టీ స్టాల్ యజమానికి తెలియకుండా బీదర్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి టీ కొట్టుకు వచ్చే కస్టమర్లకు టీ తోపాటు రూ.500 గంజాయి ప్యాకెట్ విక్రయిస్తున్నాడు. టీ స్టాల్ వద్ద తన స్కూటీలో గంజాయి ప్యాకెట్లు పెట్టి విక్రయిస్తున్నాడు. గంజాయి విక్రయంతో ఆదాయం ఎక్కువ రాడంతో గత కొంత కాలం నుంచి విక్రయిస్తున్నాడు.ఈ విషయం రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్సైజ్ సిబ్బందికి తెలియడంతో దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. సిఐ సుబాష్ చందర్, ఎస్సై అఖిల్, సిబ్బంది కలిసి పట్టుకున్నారు.
కేసు దర్యాప్తు కోసం గంజాయి, బైక్‌ను ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. మరో కేసులో కాప్రాలో గంజాయి విక్రయిస్తున్న మంద రాహుల్‌ను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ ఎస్సైలు నాగరాజు, జ్యోతి, సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 131 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాప్రాలోని నేతాజీ నగర్‌లో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. నిఘా పెట్టిన ఎక్సైజ్ సిబ్బంది గంజాయి విక్రయిస్తున్న మంద రాహుల్‌ను అరెస్టు చేశారు. కాప్రాలోని వంపు గూడలో గంజాయి విక్రయిస్తున్న విశ్వనాథ్, మనోజ్, తనీష్‌ను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 234గ్రాముల గంజాయి, మూడు బైక్‌లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయిని మహారాష్ట్ర, ధూల్‌పేటలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసిన ఎక్సైజ్ సిబ్బంది దర్యాప్తు కోసం కాప్రా ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.