Reading Time: 2 minutes

‘పెళ్ళిచూపులు’తో దర్శకుడిగా మెప్పించిన తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత నటుడిగానూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పుడతను హీరోగా చేసిన సినిమా.. ‘ఓం శాంతి శాంతి శాంతిః’. హీరోయిన్ ఈషా రెబ్బాతో కలిసి అతను మలయాళ హిట్ ’జయ జయ జయ జయహే’ చిత్రానికి రీమేక్‌గా సజీవ్ దర్శకత్వంలో ఈ సినిమా చేశాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందు కు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ: ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) గోదావరి ప్రాంతంలో చేపల చెరువులు నడిపే కుర్రాడు. అతడికి ముక్కుమీద కోపం. అలాంటి వ్యక్తితో జీవితం మీద ఎన్నో ఆశలు ఉన్న ప్రశాంతికి (ఈషా రెబ్బా) పెళ్లవుతుంది. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నా ఓంకార్.. తర్వాత తన నిజ స్వరూపం చూపిస్తాడు. చిన్న చిన్న విషయాలకు ప్రశాంతిని కొట్టడం మొదలుపెడతాడు. పైగా ఆమె కోరుకున్నట్లుగా చదువుకోనివ్వడు. కొంత కాలం మౌనంగా ఈ హింసను.. బాధను భరించిన ప్రశాంతి.. తర్వాత తిరగబడుతుంది. ఈ క్రమంలో ఆమె ఏం చేసింది.. ప్రశాంతిపై ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకున్న ఓంకార్ ఏం చేశాడు.. చివరికి వీరి కాపురం ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ: ఈ రీమేక్ చిత్రం కథలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా గోదావరి నేపథ్యాన్ని తీసుకుని దానికి అనుగుణంగా స్వల్పమైన మార్పులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఒరిజినల్లో ఉన్న భావోద్వేగాలు, ఆప్యాయతలు ఈ చిత్రంలో లోపించాయి. ఈ సినిమాలోని వినోదం ఒక మోస్తారు స్థాయిని మించలేకపోయింది. కథ లో చేసిన మార్పులు.. కొత్తగా జోడించిన సన్నివేశాలు అనుకున్నంతగా కిక్ ఇవ్వలేకపోయాయి. ’ఓం శాంతి శాంతి శాంతి’: కాలక్షేపం సినిమాలా అనిపిస్తుందే తప్ప బలమైన ముద్ర వేయలేకపోయింది. మాతృకతో పోలికల సంగతి పక్క న పెట్టి.. మామూలుగా చూస్తే ’ఓం శాంతి శాంతి శాంతి’లో స్టోరీ చాలా సింపుల్.

పురుషాధిక్యతకు మారు పేరైన అబ్బా యి.. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయికి పెళ్లి జరిగే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గోదావరి ప్రాంత మనుషుల వ్యవహారం.. అక్కడి యాస.. హీరో చేసే చేపల వ్యాపారం నేపథ్యంలో ప్రథమార్ధంలో భలే సరదాగా డైలాగులు రాసుకున్నారు. వాటి ద్వారా వినోదం పండింది. ఇక హీరోయిన్‌ను హీరో కొట్టడం, ఆ తర్వాత హీరోయిన్ చేసే కౌంటర్ ఎటాక్ సీన్లు కూడా బాగున్నాయి. కానీ ఆ తర్వాతే కథనం అనుకున్నంత ఊపుతో సాగలేదు. కథలో చెప్పుకోదగ్గ మలుపులు లేకపోవడం.. మరీ నెమ్మదిగా సాగే సీన్లు ద్వితీయార్ధాన్ని బోరుగా మార్చేశాయి. ముగింపు సన్నివేశాలు కూడా ఓ మోస్తరుగా అనిపిస్తాయంతే. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా వినోదాన్ని అందించలేకపోయింది.