
తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి మేడారం మహాజాతరకు వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజుల జాతర అనంతరం తిరుగుప్రయాణం కోసం భక్తులు అవస్తలు పడుతున్నారు. జాతరకు భక్తులను చేర్చిన రాష్ట్ర ఆర్టీసి.. తిరిగి తరలింపులో విఫలమైంది. మేడరంలో బస్సుల కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురుచూసినా.. ఆర్టీసి బస్సులు అందుబాటులో లేకుండా పోయాయి.
హైదరాబాద్, హనుమకొండ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో.. వేలాదిమంది ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. బస్సులు లేకపోవడంతో భక్తుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి బస్సులు లేక చంటి బిడ్డ తల్లులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులపై మండిపడుతున్నారు. ఇంత ఇబ్బంది పడుతున్నా.. పట్టించుకోకుండా అధికారులు అందుబాటులో లేకుండా పోయారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వాహనాలతో మేడారం రోడ్లు జామ్ అయిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడటంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులకు, అధికారులకు మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.