Reading Time: 2 minutes

 ఉన్నతస్థాయి కమిటీలో తీవ్రంగా వ్యతిరేకించాం

ఈ లింకు ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవని సిడబ్లూసి ఛైర్మన్ గతంలోనే

లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు

తెలంగాణ నీటి హక్కులపై రాజీలేదు

రాజకీయ దురుద్దేశంతో బిఆర్‌ఎస్ నేతల దుష్ప్రచారం

ఢిల్లీ నుంచి జూమ్ మీటింగ్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-, బనకచర్ల లేదా నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అటు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్, ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్లూసి) చైర్మన్ కూడా తమకు రాతపూర్వక వివరణ ఇచ్చారని ఆయన వెల్లడించారు.

డిపిఆర్ కాదు కదా, కనీసం ప్రీ-ఫీజబిలిటీ రిపోర్ట్ కూడా అనుమతి ఇవ్వలేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. మన నది జలాలను కాపాడుకోవడానికి ఎవరితోనైనా చర్చలకు సిద్ధమని, ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆయన పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశం ఢిల్లీలో శుక్రవారం జరగ్గా ఆ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు.

ఇరిగేషన్ రంగాన్ని బిఆర్‌ఎస్ నాశనం చేసింది

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ అధికారులు నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టడానికి ఒప్పుకోమని స్పష్టం చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను అజెండాలో పెట్టాలని కేంద్రానికి తెలంగాణ అధికారులు చెప్పారన్నారు. పోలవరం, నల్లమల సాగర్‌కు అనుమతి లేదని కేంద్ర మంత్రి తనకు గురువారం లేఖ రాశారని ఆయన తెలిపారు. శుక్రవారం జరిగిన సమావేశంలోనూ సీడబ్ల్యూసీ కూడా ఇదే విషయాన్ని చెప్పిందని ఆయన తెలిపారు. పదేళ్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కట్టిన ప్రాజెక్టు కూలిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఇరురాష్ట్రాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశం గురించి హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే బిఆర్‌ఎస్ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారని మంత్రి విమర్శించారు. బిఆర్‌ఎస్ నాయకులు సిగ్గుపడాలని, పదేళ్లలో ఎస్‌ఎల్‌బిసిని పూర్తి చేయలేదని, డిండి ప్రాజెక్టును సైతం పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ నాయకులు పదే పదే అబద్ధాలు చెప్పి నిజం చేయాలని అనుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అప్పులు చేసి

రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు చేసినా, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టుల ద్వారా కనీసం ఒక్క ఎకరాకు కూడా కొత్తగా నీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అప్పులు చేసి, చివరకు మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయే పరిస్థితికి తెచ్చారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కేవలం దోపిడీ వ్యవస్థగా మార్చారని ఆయన విమర్శించారు. పార్లమెంట్‌లో వెల్లడించిన ఆర్థిక సర్వే గణాంకాలను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రస్తావిస్తూ, కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టు కూడా కొత్తగా రాలేదని ఆయన వాదించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే కృష్ణా, గోదావరి బేసిన్లలో గత పదేళ్ల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని, రికార్డు స్థాయిలో వరి సాగు జరిగిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణను భారతదేశంలోనే నంబర్‌వన్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్‌గా నిలిపింది తమ ప్రభుత్వమేనని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖలో గత పదేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు, బదిలీలు, నియామకాలను పూర్తి చేసి శాఖను ప్రక్షాళన చేశామని ఆయన పేర్కొన్నారు. ఆదిత్యానాథ్ దాస్ వంటి సమర్థవంతమైన అధికారుల సలహాలతో తెలంగాణ నీటి హక్కులను కాపాడటానికి తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.