
పరీక్ష పూర్తయిన వెంటనే మార్కులు డిస్‌ప్లే
తుది ‘కీ’ అనంతరం వాస్తవ మార్కుల వెల్లడి
ఎప్‌సెట్, పిజిఇసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం
ప్రయోగాత్మకంగా అమలు
ఫిబ్రవరి 19 నుంచి ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్ 4వ తేదీ తుది గడువు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజిఎప్‌సెట్(ఎప్‌సెట్)లో ఈసారి నూతన విధానం ప్రవేశపెట్టనున్నారు. కంప్యూటర్ బేస్ట్ టెస్ట్(సిబిటి) విధానంలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలో పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థుల మార్కులు తెలుసుకునే విధానం అమలు చేయాలని ఇఎపిసెట్, పిజిఇసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే అప్పటికప్పుడే తాత్కాలిక ర్యాంకులు వెల్లడికానున్నాయి. టిజిఎప్‌సెట్, టిజిపిజిఇసెట్‌లో ప్రయోగాత్మక అమలుకు నిర్ణయించారు. ఈ విధానం వల్ల ప్రశ్నలకు ప్రాథమిక కీ ఆధారంగా సబ్జెక్టుల వారీగా విద్యార్థులు తమ మార్కులు తెలుసుకుని తమ ర్యాంకుపై ఓ అంచనాకు వస్తారు. తర్వాత ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించి తుది కీ ఖరారు చేసిన అనంతరం వాస్తవ మార్కులు ఇస్తారు.అలాగే రూ.10 వేల ఆలస్య రుసుంతో పరీక్షకు రెండు రోజుల ముందు వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మొబైల్ ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇఎపిసెట్, పిజిఇసెట్ నిర్వహణకు సంబంధించి జెఎన్‌టియుహెచ్‌లో శుక్రవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్, సెట్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయా సెట్ల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి వేరువేరుగా ప్రకటించింది. ఈ సమావేశంలో జెఎన్‌టియుహెచ్ వైస్ ఛాన్స్‌లర్ కిషన్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఎస్‌కె మహమూద్, ఇ.పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎప్‌సెట్ కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, పిజిఇసెట్ కన్వీనర్ రాజేష్‌కుమార్ సహా పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 4న ఎప్‌సెట్ నోటిఫికేషన్
ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజిఎప్‌సెట్(ఎప్‌సెట్)కు ఫిబ్రవరి 4వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి 19వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఏప్రిల్ 4 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు. గతంలో నిర్వహించిన మాదిరిగానే ఈసారి కూడా అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలతో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఎప్‌సెట్‌లో భాగంగా తొలి రెండు రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తారు, మే 9వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులపాటు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలను నిర్వహించనున్నారు. మే 4,5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇఎపిసెట్‌కు ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల నుంచి 100 శాతం సిలబస్ తీసుకోవాలని సెట్ కమిటీ నిర్ణయించింది.
షుగర్ ఉన్న విద్యార్థులకు సెంటర్‌లో తినుబండారాలు
ఎప్‌సెట్ పరీక్షలో ఈసారి షుగర్ ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. మధుమేహం(షుగర్) ఉన్నవారు పరీక్షా కేంద్రాల్లో ఇబ్బంది పడకుండా ముందుగానే తాము షుగర్ బాధితులం తెలియజేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు హెల్ప్‌లైన్‌కు తమకు షుగర్ ఉన్నట్లు సమాచారం అందజేయాలి. వారికి పండ్లు, బిస్కట్లు, చాక్లెట్లు పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. వీరితోపాటు ఎక్కువ సమయం చదువుకుని సరిగ్గా తినకుండా పరీక్షకు వచ్చే సాధారణ విద్యార్థులు కూడా ఇబ్బంది పడకుండా వారి కోసం సెంటర్‌లోనే తినుబండారాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈసారి సెట్‌ల దరఖాస్తు ఫీజుల్లో ఎటువంటి మార్పు లేదు. జోసా షెడ్యూల్ తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని వీలైనంత మేరకు త్వరగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహించేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయా పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ని ప్రకటించింది.
మార్చి 2 నుంచి పిజిఇసెట్ దరఖాస్తులు
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ పిజి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజి పిజి ఇసెట్ పరీక్ష జెఎన్‌టియుహెచ్ -హైదరాబాద్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ పరీక్షకు ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ విడుదల -చేసి, మార్చి 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 5 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 31 నుంచి జూన్ 3 వరకు టిజిఇసెట్ పరీక్ష జరుగనున్నది.
టిజిఇఎపిసెట్ షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ : ఫిబ్రవరి 14
అన్‌లైన్ దరఖాస్తులు : ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 4 వరకు(ఆలస్య రుసుం లేకుండా)
అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షలు : మే 4,5 తేదీలలో
ఇంజనీరింగ్ విభాగం పరీక్ష : మే 9 నుంచి 11 వరకు
పిజిఇసెట్ షెడ్యూల్
నోటిఫికేషన్ విడుదల -: ఫిబ్రవరి 25
ఆన్‌లైన్ దరఖాస్తులు: మార్చి 3 నుంచి మే 5 వరకు (ఆలస్య రుసుం లేకుండా)
పరీక్ష తేదీ : మే 31 నుంచి జూన్ 3 వరకు
……………………………………………………………..