
విద్యా సంస్థల్లో శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వాలి
టాయిలెట్లు, ఇతర సౌకర్యాల కల్పనలో నిర్లక్షం వద్దు
తల్లిదండ్రులు, టీచర్ల మౌనం వల్ల విద్యకు దూరమవుతున్న విద్యార్థినులు
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : పాఠశాలల్లో విద్యార్థినులకు ప్రత్యేక టాయిలెట్‌లు, నెలసరి పరిశుభ్రత ఉత్పత్తుల వంటి మౌలిక ఉత్పత్తులు కల్పించకపోవడంతో వారికి విద్యను దూరం చేస్తున్నారని, వాటిని పొందడం వారి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం విద్యార్థినుల ప్రాథమిక హక్కులైన విద్య, సమానత్వం, ఆరోగ్యం, గౌరవం, గోప్యత, జీవించే హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని అత్యున్నత న్యాయస్థానం దుయ్యబట్టింది. ఈ విషయంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై జస్టిస్ జెబి పార్దివాలా తీర్పు వెల్లడించారు. విద్యాహక్కు కీలకమైనదని, ఇది ఇతర మానవహక్కులు వినియోగించుకునే వీలు కల్పిస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం గౌరవంగా జీవించే హక్కు, విసృ్తత చట్రంలో భాగం అని గమనించాలన్నారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఆక్సో- బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్ కిన్ లను అన్ని పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా అందించేలా చూసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్నిపాఠశాలలు స్పేర్ ఇన్నర్ వేర్, స్పేర్ యూనిఫాంలు, డిస్పోజబుల్ బ్యాగ్ లు వంటి ముఖ్యమైన వస్తువులతో కూడిన కిట్ లను నిల్వచేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అంతే కాదు, నెలసరి పరిశుభ్రత, ఆ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై బాలికలకు అవగాహన కార్యక్రమాలను కూడా కల్పించాలని కోర్టు ఆదేశించింది.
నెలసరి పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడం వల్ల స్కూళ్లకు వచ్చే విద్యార్థినుల సంఖ్య పై ప్రభావం పడుతోందని, గౌరవం, గోప్యతకు సంబంధించిన ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తమ ఆదేశాలను పాటించాలని ఆదేశించారు. నెలసరి పరిశుభ్రత హక్కును దయాదాక్షిణ్యంగా చూడవద్దని సూచించింది. దివ్యాంగులకు కూడా ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ విషయంలో మౌనం వహించడం వల్ల బాలికలలో చాలామంది విద్యకు దూరమవుతున్నారని ధర్మాసనం పేర్కొంది. తప్పని సరి పరిస్థితుల్లో స్కూల్ కు గైర్హాజర్ అవుతున్న ప్రతి బాలికకు మేము చెప్పేది ఒకటే… అది మీ తప్పుకాదు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారిస్తూ, ప్రతిబాలికకు సురక్షితమైన, గౌరవ ప్రదమైన, విద్యా వాతావరణం కల్పించడం రాష్ట్రాల రాజ్యాంగ బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది.