Reading Time: 2 minutes

తిరువనంతపురం: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం ఐదో, చివరి టి20 మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరిగే ఈ ఆఖరి పోరులో విజయం సాధించాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. టీమిండియా ఇప్పటికే 31తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక కిందటి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉంది. భారత్ మాత్రం కిందటిసారి ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని తహతహలాడుతోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం.

సంజు ఈసారైనా..

వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్న స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ కనీసం చివరి మ్యాచ్‌లోనైనా తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో కలిపి మొత్తం 50 పరుగులు కూడా సాధించలేక పోయాడు. దీన్ని బట్టి సంజు బ్యాటింగ్ వైఫల్యం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈసారి విఫలమైతే అతనికి రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు సంపాదించడం చాలా కష్టమనేచెప్పాలి. ఇక కిందటి మ్యాచ్‌లో జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ఈసారి ఆడతాడా లేదా అనేది తేలలేదు. అతను బరిలోకి దిగితే భారత బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారుతోంది. విశాఖలో ఇషాన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మరోవైపు యువ సంచలనం అభిషేక్ శర్మ విశాఖలో డకౌట్ కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ సిరీస్‌లో అభిషేక్ ఇలా ఔట్ కావడం రెండోసారి కావడం గమనార్హం.

ఆఖరి మ్యాచ్‌లో అతను తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ చెలరేగితే కివీస్ బౌలర్లకు మరోసారి కష్టాలు ఖాయం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. కిందటి మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. ఈసారి అతను జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. శివమ్ దూబె ఫామ్‌లో ఉండడం భారత్‌కు సానుకూల అంశంగా చెప్పొచ్చు. విశాఖలో దూబె విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. ఈసారి కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. హార్దిక్ పాండ్య రూపంలో మరో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ ఉండనే ఉన్నాడు. అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఆత్మవిశ్వాసంతో కివీస్

కిందటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ చివరి టి20కి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి సిరీస్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.