
అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించిన స్పీకర్
దానం పార్టీ మారలేదని గట్టిగా వాదించిన ఆయన తరపు న్యాయవాదులు
కాంగ్రెస్ టిక్కెట్టుపై లోక్‌సభకు పోటీచేశారని వివరించిన పాడికౌశిక్ లాయర్లు
విచారణ వచ్చేనెల 18కి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న ఆరోపణలతో దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట పిటిషనర్, కౌంటర్ పిటిషనర్ల న్యాయవాదులు హోరా-హోరిగా వాదనలు వినిపించారు. కేసును స్పీకర్ ప్రసాద్ కుమార్ వచ్చే నెల 18కి వాయిదా వేశారు.
శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే దానం నాగందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌పై విచారణ చేపట్టారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాదులు దానం నాగేందర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. తాను పార్టీ ఫిరాయించలేదని, బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని దానం సమాధానమిచ్చారు. పార్టీ మారినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను, ఇంకా తాను కాంగ్రెలో ఉన్నానంటూ బహిరంగంగా చెప్పిన పత్రికల వార్తలను, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ఆడియో, వీడియో క్లిప్పింగ్స్‌ను న్యాయవాదులు చూపించారు. పార్టీ ఫిరాయించినట్లు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తను పార్టీ మారినట్లు బిఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తున్నదని దానం చెప్పారు.
పాడిపై ప్రశ్నల పరంపర..
పిటిషనర్, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని దానం నాగేందర్ తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించినట్లు ఎవరు చెప్పారు?, కేసు ఎందుకు వేశారు.?, మీ క్లయింట్‌కు సంబంధించిన పార్టీ శాసనసభాపక్షం అకౌంట్‌లోకి ప్రతి నెలా తన జీతం నుంచి డబ్బులు పడుతున్నాయి కదా అని ప్రశ్నించారు. 2023 సంవత్సరంలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం, ఆ తర్వాత 2024లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని ఆరోపించారు. పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన ‘బి-ఫామ్’ను, ఇంకా ఎన్ని ఓట్లు లభించాయో వంటి పక్కా ఆధారాలను సమర్పిస్తానని కౌశిక్ రెడ్డి సమాధానంగా అన్నారు.
ఇదిలాఉండగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ శాసనసభ్యత్వం రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున న్యాయవాది హాజరయ్యారు. తన క్లయింట్ మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున స్వయంగా హాజరుకాలేకపోయారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం వచ్చే నెల 20వ తేదీలోగా విచారణకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దానం పార్టీ ఫిరాయించారనడానికి తమ వద్ద ఉన్న ఆధారాల ప్రతులను న్యాయవాది స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు అందజేశారు. దీంతో స్పీకర్ కేసును వచ్చే నెల 18కి వాయిదా వేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ రోజున విచారణకు హాజరవుతారు.