
నందినగర్‌లోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ
తాజాగా నోటీసులు జారీ చేసిన సిట్
ఆదివారం మ. 3గంటలకు అందుబాటులో ఉండాలని ఆదేశం
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారించాలని గతంలో కోరిన బిఆర్‌ఎస్ అధినేత
ఎలక్ట్రానిక్ వస్తువుల సాయంతో విచారించాల్సి
ఉన్నందున ఎర్రవల్లిలో సాధ్యం కాదని తేల్చిన సిట్
నందినగర్ ఇంటి గోడకు నోటీసులు అతికించిన అధికారులు
కెసిఆర్ సిబ్బందికి సమాచారం
మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నాం మూడు గంటలకు హైదరాబాద్‌లోని నందినగర్(ఆయన నివాసం)లోనే విచారిస్తామని సిట్ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మరోసారి నోటీసులు అందించేందుకు నందినగర్‌లో ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు వాటిని అంటించారు. వారింట్లో పనిచేసే సిబ్బందికి నోటీసుల సమాచారం తెలియజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని సిట్(ప్రత్యేక దర్యాప్తు) బృందం విచారణ అధికారి ఏసిపి వెంటగిరి కెసిఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది.
ఈ క్రమంలో విచారణకు శుక్రవారం రాలేనని, తాను మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో పార్టీ పరంగా బిజీగా ఉన్నానంటూ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే తనను హైదరాబాద్‌లోని తన నివాసంతో కాకుండా ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్‌లో విచారించాలని కోరారు. అయితే కెసిఆర్ విజ్ఞప్తిని సిట్ బృందం శుక్రవారం న్యాయ సలహా తీసుకున్న అనంతరం తిరస్కరించింది. దీంతో న్యాయవాదులతో చర్చించిన సిట్ అధికారులు సిఆర్‌పిసి 160 ప్రకారం కెసిఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు. కెసిఆర్ రిప్లైని పరిగణలోకి తీసుకుని కెసిఆర్ వయస్సు తోపాటు చట్టం నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్‌లోని నందినగర్‌లో విచారణ చేయనున్నట్లు తాజా ఇచ్చిన నోటీసుల్లో తెలిపారు. దీంతో పాటు విచారణలో భాగమయిన పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎర్రవెల్లిలో విచారించేందుకు వీలుపడదని అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు.
విచారణ స్థలాన్ని మార్చాలని కోరిన కెసిఆర్ విజ్ఞప్తి మేరకు ఆయన వయస్సు, కేసు చట్టపరిధిని పరిగణలోకి తీసుకుని హైదరాబాద్‌లోని నివాసంలో విచారిస్తామని సిట్ అధికారులు నోటీసుల్లో తేల్చిచెప్పారు. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో మధ్యాహ్నాం మూడు గంటలకు విచారణకు సిద్దంగా ఉండాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.