Reading Time: 3 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కాంట్రాక్టులపై 2014 నుంచి విచారణకు సిద్ధమేనా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ మంత్రి హరీష్‌రావుకు సవాల్ విసిరారు. ఎవరెవరికో లేఖలు రాయడం కాదని, అ లేఖ ఏదో తనకే రాస్తే ఇప్పుడే కాదు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాం 2014 నుంచి నైనీ బొగ్గు గనుల కేటాయింపుల వరకు జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరపడానికి సిద్థంగా ఉన్నామని ప్రకటించారు. ఒకరు కథ నం రాస్తే మరొకరు లేఖ రాశారని, ఇంకొకరు విచారణకు ఆదేశించార ని, ఈ ముగ్గురికీ  ఉన్న సంబంధం ఏంటని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.సీఎం అమెరికా పర్యటన నుంచి వచ్చే లోగా లేఖ రాస్తే ఆయనను ఒప్పించి విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నానని భట్టి స్పష్టం చేశారు. సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన ఖండించారు. సృజన్ రెడ్డి బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి అల్లుడు అని,

ఆయన కూతురు దీప్తి రెడ్డి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారని భట్టి వివరించారు. తాను సిఎల్‌పి నాయకుడిగా ఉన్న సమయంలో ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని, ఆయనకు కాంట్రాక్టుల ఆశ చూపి బిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నది ఎవరని భట్టి దుయ్యబట్టారు. సింగరేణిలో 2014 నుంచి పొందిన కాంట్రాక్టుల పైనే కాకుండా తాడిచర్ల కాంట్రాక్టుపై కూడా విచారణలో చేర్చుదామన్నారు. తాను ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాల్లో రాలేదని, కార్మికుల చెమటతో సృష్టించిన సింగరేణి సంపదపై ఏ రాబందులను వాలనివ్వనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల సింగరేణి కాంట్రాక్టులు, తనపై వస్తున్న ఆరోపణలపై భట్టి తీవ్రంగా స్పందించారు. ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి ఈ కథనాలు వండి వార్చుతున్నారని ఒక పత్రికాధిపతిపై భట్టి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తన చిన్నపుడు ఏ నినాదం అయినా వస్తే ఆ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయోనని అనుమానించే వాడినన్నారు. పది సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన హరీష్‌రావు తన లేఖలో సో కాల్డ్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అని పేర్కొన్నారని, ఈ నిబంధన ఏదో తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినట్లుగా హరీష్‌రావు భావిస్తున్నారని, ఈ నిబంధన ఇప్పటిది కాదని, అది తమ ప్రభుత్వం తెచ్చింది కాదని , కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ అమలులో ఉన్నదేనని ఆయన గుర్తు చేశారు. ఐఐటి, హెచ్‌పీసీఎల్, ఐఐఎం, రైల్వే, హిందుస్థాన్ కాపర్స్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ, మహారాష్ట్ర ప్రభుత్వ టెండర్లలోనూ ఈ నిబంధన ఉందని భట్టి విలేకరుల సమావేశంలో వాటికి సంబంధించిన పత్రాలను చూపించారు. ఏ కుంభకోణం జరగకపోతే టెండర్లు ఎందుకు రద్దు చేస్తారని హరీష్‌రావు అంటున్నారని, అసలు ఈ నైనీ బొగ్గు గనులు టెండర్ల నోటిఫికేషన్ దాకా ఇంకా వెళ్లలేదనే విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. సింగరేణిలో డీజిల్ చోరీ జరుగుతుందని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది తామేనని పేర్కొన్నారు. ఈ సంస్థలో పనిచేసే వాహనాలకు డీజిల్ సరఫరా చేయడం తమ హయాంలో తీసుకువచ్చిన నిర్ణయం కాదని, 24 జులై 2002లోనే తీసుకువచ్చారని, అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా, బిఆర్‌ఎస్సా హరీష్‌రావు సమాధానం చెప్పాలన్నారు.

తాను మండుటెండలో పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహించి సింగరేణి గనులను సందర్శించానని, సింగరేణి కార్మికుల రక్తం, స్వేదంతో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, ఇటువంటి బొగ్గు సంపద పైన ఏ రాబందులు, గద్దలు వాలకుండా చూడడమే తన కర్తవ్యమన్నారు. సింగరేణి 105 సంవత్సరాల క్రితం స్థాపితమైందని, అది తెలంగాణ ప్రజల సంపద అని, దానిని ఎవరో దోచుకువెళతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత పదేళ్లలో కొత్త బొగ్గు గనుల అభివృద్ధిలో తగిన ప్రయత్నాలు జరగకపోవడం వల్ల భవిష్యత్తులో ఉత్పత్తి, ఆదాయం తగ్గి వేలాది కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో మార్పులు, గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో, నాణ్యమైన బొగ్గు గనులను త్వరగా సొంతం చేసుకుని ఆపరేషన్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సింగరేణిని కేవలం బొగ్గుకే పరిమితం చేయకుండా క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, సింగరేణి మేనేజ్‌మెంట్ , కార్మికులు పూర్తి అంకితభావంతో సంస్థ భవిష్యత్తును కాపాడుతామని స్పష్టం చేశారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతూ కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే తాను వారం రోజుల క్రితం ఈ అంశంపై స్పందించి వివరాలన్నింటినీ ప్రజల ముందు ఉంచినప్పటికీ తమ తప్పు తెలుసుకుని వాస్తవాలేమిటో తెలియచేస్తారని ఆశించినప్పటికీ ఆ ప్రయత్నమే చేయలేదన్నారు. ఈ అంశంలో అడ్డగోలుగా కథనాలు వండి వారిస్తే సహించే ప్రసక్తే లేదని భట్టి హెచ్చరించారు. పెట్టుబడులు, కట్టు కథల విషపు రాతలతో ఓ పత్రికాధినేత తనపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవి, వాస్తవ దూరమైనవని, కనుక ఆయన రాసినవన్నీ అవాస్తవాలని స్వయంగా తిరిగి రాయాలని, లేనట్లయితే ఆయన రాతలు తన వ్యక్తిత్వ హననం కోసమే పనికట్టుకుని రాసినట్లుగా భావించాల్సి ఉంటుందని అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న కథనాలు తనను ఆవేదనకు గురిచేశాయన్నారు. సింగరేణిలో టెండర్లు, వాటికి సంబంధించిన టెండర్లు కానీ, వాటికి సంబంధించిన ఫైళ్లు తన వద్దకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వద్దకు రావని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పారదర్శకంగా సేవలు అందించేందుకు సింగరేణి కాలరీస్ సంస్థకు ఒక బోర్డు ఉందని, అందులో సీనియర్ అధికారులు ఉంటారని, వారంతా ఒక స్వయంప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. అన్ని నిర్ణయాలు సంస్థలో అమలులో ఉన్న విధి విధానాలు, నిబంధనల ప్రకారమే స్వతంత్రంగా తీసుకుంటారని, రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.