Reading Time: < 1 minute

దావోస్/వాషింగ్టన్: భారత్‌పై విధించిన టారీఫ్‌లపై అమెరికా కొంత మెత్తబడినట్లుగా కనిపిస్తోంది. 50 శాతం వరకు సుంకాలను విధించి ఇప్పటికే వాటిని అమలు చేస్తోన్న అమెరికా వాటిని 25శాతానికి తగ్గిం చే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా వెల్లడించింది. ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ శుక్రవారంనాడు దావోస్‌లో మాట్లాడుతూ.. రష్యా నుంచి భా రత్ భారీ ఎత్తున్న చమురు దిగుమతులను తగ్గించినందున ఆ దేశంపై విధించిన 25శాతం అదనపు సుంకాలను వెనక్కి తీసుకునే యోచనలో ఉన్నామని, దానికి ఒక మార్గం ఉందని అన్నారు. భారత రిఫైనరీలు చమురు దిగుమతి తగ్గించుకోవడం మేం విధించిన టారీఫ్‌ల వల్లనే సాధ్యమైంది, 

ఇది కచ్చితంగా మాకు భారీ విజయమనే చెప్పాలని బెసెంట్ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్ మాత్రం తమ ఇంధన విధానానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. జనాభాకు తగ్గట్టుగా సరిపడ్డా చమురు నిల్వలు ఉంచుకోవాలని రిఫైనరీలకు సూచించినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై 500శాతం సుంకాలు విధించే ప్రతిపాదిత బిల్లుపై అమెరికా కాంగ్రెస్‌లో చర్చ జరగనున్న సమయంలో ఇరు దేశాల నుంచి తాజా ప్రకటనలు వెలువడడం విశేషం. తమకు ఆ బిల్లుపై అవగాహన ఉందని, అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు విదేశాగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీప్ జైశ్వాల్ తెలిపారు.