
‘నా దేశ ప్రజల చేతికి కత్తిని ఇవ్వలేదు, ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులే అవుతారో, అమ్ముకొని బానిసలుగా ఉంటారో వారి చేతుల్లోనే ఉంది’ అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనడాన్ని బట్టి ఓటు ప్రాముఖ్యత మనకు అవగతం అవుతుంది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) స్థాపించిన రోజును గుర్తు చేసుకుంటూ ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు, ఓటింగ్ ప్రాముఖ్యతను తెలియజేసేందుకుగాను 2011 నుండి జనవరి 25న ఓటరు దినోత్సవంగా ఏటా వేడుకలు నిర్వహిస్తున్నాం. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం యువతను ఓటర్లుగా నమోదు చేయడం, వారికి ఓటరు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంపై దృష్టి పెట్టింది. మన దేశంలో మొదటిసారిగా 1920లో ఎన్నికలు జరిగాయి. అప్పటికి మనల్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటం చివరి అంకానికి చేరుకునే రోజులవి. అప్పుడు కేవలం పట్టభద్రులైన వారికి, ఐదు ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉండి భూమిశిస్తూ కట్టే వారికి, ఆస్తిపన్ను కట్టే వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. అంటే జనాభాలో కేవలం 12% మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యేవారు. అయితే ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికలే కీలకం కావున సామాన్యుడు ఓటు హక్కు కోసం సార్వత్రిక ఓటింగ్ సాధించే వరకు నిరంతరం పోరాడిన భారత భాగ్య విధాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.
1919లో భారత ప్రజలను పరిపాలనలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ పాలకులు సౌత్ బరో అనే రాజకీయ నిపుణుడి నాయకత్వంలో ఒక కమిటీని వేశారు. తన జాతి జనుల విముక్తి కోసమేకాక అన్నివర్గాల ప్రజల కోసం తపించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆ కమిటీకి ఇచ్చిన నివేదికలో ప్రజాస్వామ్య తాత్వికతకు పునాది వేశారు. ఆ పునాదులే రాజ్యాంగ రచనకు ఆధారమయ్యాయి. నేటి ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టడానికి సాధనాలు అవుతున్నాయి. ఆ నివేదికలో అంబేద్కర్ ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలి. కానీ కొద్ది మందికి మాత్రమే ఓటు హక్కు ఉండటం నిరంకుశత్వానికి, నియంతృత్వానికి, అప్రజాస్వామ్యానికి సూచిక అవుతుంది. కావున వయోజనులైన ప్రతి భారతీయుడికీ ఓటు హక్కు కచ్చితంగా ఉండాలని ప్రతిపాదించారు. కానీ సౌత్ బరో కమిటి ఆ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ఆ కమిటీ సిఫారసులకు అనుగుణంగా బ్రిటిష్ పాలకులు 1920లో మొట్టమొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ జాన్ సైమన్ చైర్మన్‌గా మరో కమిటిని భారతదేశానికి పంపింది. దేశపర్యటన చేసి సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసే క్రమంలో ఆ కమిటికి కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 21 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడికీ ఓటు హక్కు ఉండాలంటూ తన నివేదికను సమర్పించారు. అయితే కాంగ్రెస్ సైమన్ గో బ్యాక్ అంటూ నినదించి ఆ కమిటీ సిఫారసులు అమలు కాకుండా చేసింది. 1930; 1931న లండన్‌లో జరిగిన రౌండ్ టేండ్ సమావేశాలలో అణగారిన వర్గాలతోపాటు అందరికీ పాలనలో భాగస్వామ్యం దక్కాలని అంబేద్కర్ పట్టుబట్టినా బ్రిటిష్ ప్రభుత్వం అందరికీ ఓటు హక్కు అనే విషయాన్ని పట్టించుకోలేదు.
1935లో మొదటిసారిగా వచ్చిన భారత చట్టంలోనూ సార్వత్రిక ఓటింగ్‌కు అవకాశం రాలేదు. 1937, 1946లో జరిగిన ఎన్నికల్లో కూడా గతంలో మాదిరిగానే కేవలం విద్యావంతులకు, వ్యాపారులకు, భూస్వాములకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. వాళ్ల ప్రతినిధులు మాత్రమే పార్లమెంటులో, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం సాధించడంతో నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకుని అవకాశం దక్కింది. అనేక దేశాల్లో వచ్చిన విప్లవ మార్పులు, పరిణామాలను అర్థంచేసుకొని ఒక రాజ్యాంగం ఆవశ్యకతను గుర్తించి దాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం అనివార్యమైంది. ఆక్రమంలోనే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అంబేద్కర్ నాయకత్వం వహించడం, తద్వారా సార్వత్రిక ఓటింగ్ హక్కును ఆర్టికల్ 326లో ఉంచడం జరిగింది. 6వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ద్వారా వయోజన ఓటు హక్కును 18 ఏళ్లకు తగ్గించారు. ఇది 1989 మార్చి 28 నుండి అమలులోకి వచ్చింది. 1989 లోక్‌సభఎన్నికల్లో 18 ఏళ్ల ఓటర్లకు మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభించింది. దేశగతిని మార్చగల శక్తి ఒక్క ఓటుకే ఉన్నది. అలాంటి ఆయుధాన్ని వృథా చేసుకోవడం లేదా ప్రలోభాలకులోనై అమ్ముకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఓటు ఒకవ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది.
రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రలోభాలకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ఓటు నోటుకు లొంగిపోతే ప్రజలు బానిసత్వంలోకి వెళ్లడం ఖాయం. యువత దేశానికి వెన్నెముక. ఓటర్లు చురుకుగా ఉంటే రాజకీయ నాయకులు యువ సమస్యలపై గంభీరంగా పనిచేస్తారు. కానీ నేటి యువతలో కేవలం 60 నుండి 65% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల రోజును సెలవు దినంగా భావించడం, అలసత్వం, ఒక్క ఓటుతో ఏ మార్పు రాదన్న భావన పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉండటం వారి బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట. రాజకీయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, భూస్వాములు ఇలా కేవలం ధనవంతులు మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాగించడం ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు లాంటిది. ప్రజల తాత్కాలిక అవసరాలను గుర్తించి వారి ధనంతో ప్రలోభపెట్టి ఓటును కొనుగోలు చేసే దుర్మార్గపు చర్యలను ఓటర్లకు అవగతమయ్యేటట్లు తెలిపి వారు దేశ భవిష్యత్తు కోసం సరియైన నాయకులను ఎన్నుకునే విధంగా వారికి అవగాహన కల్పించడం ప్రజాస్వామిక వాదులుగా మనందరి కర్తవ్యం.
ములక సురేష్
9441327666