
పెట్టుబడిదారీ దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, ఆ దేశాలమధ్య వైరుధ్యాలను సృష్టించింది. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధాలకు మద్దతు ఇస్తూ వచ్చిన నాటో కూటమి దేశాలు నేడు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. వెనెజువెలా పై అమెరికా దాడిని, గ్రీన్‌లాండ్ ను ఆక్రమిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనను ఇయు దేశాలు వ్యతిరేకించాయి. అమెరికా విధానాలు నాటో విచ్ఛిన్నానికి దారి తీస్తుందని పేర్కొన్నాయి. స్టాలిన్ నాయకత్వాన ఉన్న సోవియట్ యూనియన్ అన్ని రంగాల్లో దూసుకుపోవడమే కాకుండా, సైనిక శక్తిలో అమెరికాను ఢీ కొనగలిగిన సామర్థ్యం కలిగి ఉండటం, అల్బేనియా, రుమేనియా, ఉత్తరకొరియా తదితర దేశాలు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాలుగా ఉండటం, చైనాలో మావో నాయకత్వాన విప్లవం చివరి విజయానికి చేరుకోవడం, అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడి బలమైనశక్తిగా మారడంతో భయపడిన అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ తదితర 12 దేశాలతో, సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా 1949లో ‘నాటో’ (నార్త్ అట్లాంటిక్ ట్రీ టీన్) కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలోని దేశాల ప్రధాన ఉద్దేశం వెనకబడిన దేశాల సహజ వనరుల దోపిడీలో భాగం కోసమే.
నాటో సభ్యదేశాల్లోని ఏ దేశంపైనైనా మరో దేశం దాడి చేస్తే, తమపై దాడిగానే భావించి మిగిలిన సభ్యదేశాలు, ఆ దేశానికి అండగా ఉండాలన్నది నాటో ఏర్పాటు ఉద్దేశం. అంతేకాకుండా ఒక నాటో దేశం వేరొక దేశంపై దాడి చేసినా అందుకు మద్దతుగా ఉండాలి. ఇతర దేశాలపై దాడులు చేస్తున్నది అమెరికా, తదితర పెట్టుబడిదారీ దేశాలే అన్నది గమనించాలి. తన దురాక్రమణ దాడులకు మద్దతుగా నాటో దేశాలు ఉండాలన్నదే అమెరికా ఉద్దేశం. పెట్టుబడిదారీ విధానాల పునరుద్ధరణ ఫలితంగా ఏర్పడిన ఆర్థ్ధిక, రాజకీయ సంక్షోభం ఫలితంగా 1991లో సోవియట్ యూనియన్ పతనమై అనేక దేశాలుగా ఏర్పడ్డాయి. సోవియట్ పరిణామాల తర్వాత తూర్పు ఐరోపాలోని అనేక దేశాలు నాటోలో చేరాయి. వాటిల్లో సోషలిజానికి తిలోదకాలు ఇచ్చి పెట్టుబడిదారీ విధానాన్ని చేపట్టిన అల్బేనియా, బల్గేరియా, రుమేనియా, చెక్‌రిపబ్లిక్‌తోపాటు హంగరీ, పోలెండ్ తదితర దేశాలు నాటో పంచన చేరాయి. తటస్థంగా ఉన్న ఫిన్లాండ్ 2023లో, స్వీడన్ 2024లో నాటోలో చేరటం జరిగింది. ఉక్రెయిన్ నాటోలో చేరటానికి దరఖాస్తు చేసింది.
అమెరికా ప్రపంచ ఆధిపత్య విధానాల్లో భాగంగా అనేక దేశాల్లోని సహజ వనరులను తరలించుకుపోవడానికి అడ్డంకిగా ఉన్న దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేసింది. 2001లో అఫ్ఘానిస్థాన్‌పై దాడి చేసింది. 1999లో యుగోస్లేవియా (యుగోస్లేవియా- కొసావో యుద్ధం)పై వైమానిక దాడులు చేసింది. చమురు నిల్వలు తరలించుకుపోవడానికి ఇరాక్‌పై దాడిచేసి సద్దాం హుస్సేన్‌ని ఉరితీసింది. జెలెనె స్కీని రెచ్చగొట్టి ఉక్రెయిన్ రష్యాతో యుద్ధానికి తలపడేలా చేసి ఆయుధాలు సప్లయ్ చేస్తూ యుద్ధం ఆరకుండా చేస్తున్నది. ఈ దాడులన్నీ అమెరికా ఆధిపత్య దోపిడీ విధానాల్లో భాగమే. అమెరికా దాడులకు నాటో మద్దతు ఇస్తూ వచ్చింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని సృష్టించిన అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేయరాదని నాటో దేశాలపై కూడా ఆంక్షలు పెట్టటం వల్ల అమెరికా ఎడల నాటో దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రంప్ ఆంక్షలు తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని భావించాయి.
వెనెజువెలాపై అమెరికా దాడితో కూటమి దేశాల్లో ఉన్న వ్యతిరేకత బయటపడింది. నాటోలోని ముఖ్య పెట్టుబడిదారీ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా మొదలైన దేశాలు అమెరికా దాడిని వ్యతిరేకించాయి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగి డెన్మార్క్ భూభాగంలో అంతర్భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలుపుకుంటామని, తమ దేశభద్రతకు గ్రీన్ లాండ్ అవసరమని, అందుకు అంగీకరించకపోతే దాడి చేసి ఆక్రమిస్తామని, బలపరచని దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10% దిగుమతి సుంకం విధిస్తానని, ఆ తర్వాత కూడా ఒప్పందం కుదరకపోతే జూన్ నుంచి 25% సుంకం విధిస్తానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను నాటో దేశాలు తీవ్రంగా ఖండించాయి. తన దేశప్రయోజనాలకు విరుద్ధంగా ఏ దేశం ఉన్నా సహించని ట్రంప్ చెప్పడమే కాకుండా గ్రీన్‌లాండ్ విషయంలో తనకు మద్దతు ఇవ్వని నాటో కూటమి దేశాలకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశాడు. దీన్ని గమనిస్తే నాటో కూటమి తన ప్రయోజనాలను మాత్రమే కాపాడాలని, అందుకు విరుద్ధంగా ఏ దేశం ఉన్నా సహించని ట్రంప్ హెచ్చరిక చేయడం అగ్ర రాజ్య దురహంకారానికి, నాటో దేశాల వెడల చులకన భావనికి నిదర్శనం. ట్రంప్ హెచ్చరికలను ఐరోపా సమాఖ్య దేశాలు తీవ్రంగా పరిగణించాయి. తీవ్ర పదజాలంతో ఖండించాయి. దావోస్ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశాన్ని అందుకు వేదిక చేసుకున్నాయి.
ట్రంప్ సమావేశానికి రాకముందే వివిధ దేశాల నేతలు ట్రంప్ విధానాలను దుయ్యబట్టారు. అమెరికా నాయకత్వాన ఉన్న ప్రపంచ వ్యవస్థకు ముగింపు పలికి ఐక్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి. బలవంతుల చట్టానికి లొంగిపోకూడదని, బెదిరింపులకు బదులు గౌరవాన్ని కోరుకుంటున్నామని, గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ వైఖరి నాటో కూటమికి చేటుచేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్కొన్నాడు. అమెరికా చెప్పే గాజా శాంతి బోర్డులో చేరటానికి ఫ్రాన్స్ నిరాకరించింది. ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యూరప్ స్వాతంత్య్రంపై ఏకాభిప్రాయం పెరిగిందని, ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ తెలిపాడు. బెల్జియం ప్రధాన మంత్రి బార్ట్ డి వెవర్ మాట్లాడుతూ 27 దేశాల ఐరోపా సమాఖ్య ఒక కూడలిలో ఉందని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా మద్దతు, తర్వాత ఎదుర్కొన్న దారుణ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో నిర్ణయించుకోవాలన్నాడు. సంతోషకరంగా ఉండటం ఒక విషయం కాగా, దుర్భరమైన బానిసగా ఉండటం మరొకటి అని ట్రంప్ సుంకాలపై బెదిరింపుల గురించి డి వెవల్ వ్యాఖ్యానించాడు.
అమెరికా నాయకత్వంలోని ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక విచ్ఛిన్నాన్ని ఎదుర్కొంటున్నదని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సూటిగా వ్యాఖ్యానించాడు. మనం పరివర్తనలో కాదు విచ్ఛిన్నంలో ఉన్నామని, అంతర్జాతీయ నియమాల ఆధారిత క్రమం పాక్షికంగా అబద్ధమని మాకు తెలుసు. బలవంతులు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు తమకు తాము మినహాయించుకుంటారు. వాణిజ్య నియమాల అమల్లో అసమానంగా వ్యవహరిస్తారు అంటూ ట్రంప్ గురించి వ్యాఖ్యానించాడు. తమ దేశసార్వభౌమత్వ అంశాన్ని ఇతరులతో చర్చించాల్సిన అవసరం లేదని డెన్మార్క్ మహిళా ప్రధాని మెటె ఫెడరిక్షన్ చెప్పారు. దావోస్‌లో ట్రంప్‌ను కలవకుండానే డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, యుకె నేతలు స్వదేశాలకు బయలుదేరారు. అమెరికా సామ్రాజ్యవాదం అణ్వస్త్రాల బూసిని చూపి ప్రపంచ పెత్తనం కోసం అర్రులు చాస్తోంది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు కూడా చెప్పుచేతుల్లో ఉండాలని, తన ప్రయోజనాలు కాపాడాలనే విధంగా వ్యవహరిస్తున్నది.
అమెరికా ఆధిపత్య విధానాల ఫలితంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మొదలైన పెట్టుబడిదారీ దేశాల దోపిడీ ప్రయోజనాలు దెబ్బ తింటూ వచ్చాయి. అమెరికాపై గుర్రుగా ఉన్నాయి. ఇవి కూడా సామ్రాజ్యవాద కాంక్షగల దేశాలు కావడమే అందుకు కారణం. తమ దేశాల్లో కూడా ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఏర్పడి సమస్య వలయంలో చిక్కుకున్న ప్రజలు వీధి పోరాటాలకు దిగుతున్నారు. అమెరికా దురాక్రమణ యుద్ధాలకు మద్దతు ఇవ్వరాదని ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇది తమ అధికారానికే ప్రమాదమని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలు భావించాయి. వీటన్నిటి ఫలితమే అమెరికాకు వ్యతిరేకంగా ఈ దేశాలు ముందుకు రావడం, అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ విధానాలను వ్యతిరేకిస్తూ, గ్రీన్‌లాండ్ స్వయం ప్రతిపత్తి, పూర్తి స్వాతంత్య్ర కాంక్షను అమెరికా గౌరవించాలని, గ్రీన్‌లాండ్ ఆక్రమణ విధానాలను మానుకోవాలని, వెనెజువెలా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని ప్రపంచ ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.
బొల్లిముంత సాంబశివరావు
9885983526