Reading Time: < 1 minute

దుబాయ్: ఉద్రిక్తత మరింత రాజుకుంది. ఇరాన్ శనివారం అమెరికాను తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇరాన్ సైనిక రెవెల్యూషనరీ గార్డు అధినేత , సుప్రీం కమాండర్ జనరల్ మెహమ్మద్ పక్పోర్ తాము అమెరికాతో యుద్థానికి సర్వం సన్నద్ధంగా ఉన్నామన్నారు. తమ చేతి వేలు ఇక ట్రిగ్గర్ నొక్కడానికి సిద్ధంగా ఉందని అరబీలో ఘాటైన సందేశం వెలువరించారు. ఫింగర్ ఆన్ ట్రిగ్గర్ అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఇప్పుడు తాము రెడీగా ఉన్నామని చెప్పారు. మధ్య ప్రాచ్యం వైపు అమెరికా యుద్ధ నౌక ఒకటి దూసుకువస్తున్న దశలో ఇరాన్ సైనిక అధినేత హెచ్చరికలు కలకలానికి దారితీశాయి. ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలికి చెందిన వార్తా సంస్థ నౌర్‌న్యూస్ తమ టెలీగ్రామ్ ఛానల్ ద్వారా సుప్రీం కమాండర్ హెచ్చరికలను తెలియచేసింది.

అమెరికా, ఇజ్రాయెల్‌లు ఎటువంటి దుస్సాహానికి పాల్పడ్డా తాము ఉరుకునేది లేదని ఇందులో తెలిపారు. ఇక ట్రిగ్గర్ నొక్కడమే తరవాయి అని తేల్చిచెప్పారు. అమెరికా తెగించి దుస్సాహానికి పాల్పడకుండా ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డు, మా ప్రియమైన ఇరాన్ దేశం సిద్ధంగా ఉంది. యుద్ధానికి అందే సర్వోన్నత ఆదేశాల గురించి ఎదురుచూస్తోందని తెలిపారు. డిసెంబర్ 28 నుంచి ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇస్లామిక్ పాలకులకు వ్యతిరేకంగా ఇరాన్‌లో వీధుల్లో నిరసనలకు అమెరికా మద్ధతు, దీనికి ప్రతిగా ఇరాన్ పాలకులు అణచివేత చర్యలతో పరిస్థితి దిగజారింది. ప్రతికూల పరిస్థితులతో ఇరాన్ రియాల్ కరెన్సీ పతనం అయింది. ఇరాన్‌లో రక్తపాతానికి ట్రంప్ కవ్వింపు చర్యలే కారణం అని ఇరాన్ అధినేత ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ పాలన అంతం అయితేనే ఇరాన్‌కు శాంతి అని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.

ఇరాన్ వైపు భారీ అమెరికా యుద్ధ నౌకలు: ట్రంప్

ఇరాన్‌లో పరిస్థితిని తాము జాగ్రత్తగా గమనిస్తున్నామని అమెరికా అధ్యక్షులు ట్రంప్ తెలిపారు. అక్కడ శాంతియుత ప్రదర్శనలపై అణచివేతలను సహించేది లేదన్నారు. అయితే తమ హెచ్చరికలతో ఇప్పుడు చాలా వరకూ బహిరంగ ఉరిశిక్షలు ఆగిపొయ్యాయని చెప్పారు. ఇక అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ వైపు దూసుకువెళ్లుతున్నాయి. వీటిని అవసరం అయితే వెంటనే దాడులకు ఉపయోగిస్తామని, అయితే చర్య అవసరం ఉండకపోవచ్చు. కానీ చర్యకు సిద్ధం అన్నారు.