Reading Time: < 1 minute

దుబాయ్: మరో పది రోజుల్లో జరుగనున్న టి20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ జట్టును తప్పించింది ఐసిసి. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌కు అవకామిస్తూ శనివారం తుది నిర్ణయాన్ని ప్రకటించింది. భద్రతా కారణాల దృష్టా భారత్‌లో పర్యటించబోమని, తమ మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బిసిబి) ఐసిసిని కోరింది. అయితే, ఈ నిర్ణయాన్ని ఐసిసి తిరస్కరించింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పులేదని పేర్కొంది. అయినా బిసిసిబి ససేమిరా అనడంతో ఐసిసి ఈ చర్యకు ఉపక్రమించింది.

బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడించేందకు ఐసిసి నిర్ణయించింది. కాగా, ఫిబ్రవరి 7 నుంచి ఈ పొట్టి టోర్నీకి ప్రారంభం కానుండగా.. స్కాట్లాండ్ గ్రూప్ సిలో ఉంది. కోల్‌కతా వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లండ్ తలపడనుంది. మరో మ్యాచ్ నేపాల్‌తో తలపడనుండగా.. ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరుగనుంది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగడం తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూడనుంది. ఏకంగా 5లక్షల డాలర్లు కోల్పోవలసి వస్తుంది.

మా ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే: పాక్

ఐసిసి టి20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మప్ మోషిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీ పాక్ ఆడటం మా ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. ‘బంగ్లాను తప్పించొద్దు. ఐసిసి సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశాను. ఆ జట్టుకు అన్యాయం చేయరాదు. మా ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఆయన రాగానే ప్రభుత్వంతో చర్చించి. టోర్నీలో పాల్గొనాలా? వద్దా అనే నిర్ణయాన్ని ప్రకటిస్తాం’ అని పేర్కొన్నాడు.