
అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. తన భార్యను , ముగ్గురు బంధువులను గన్‌తో కాల్చి చంపాడు. కుటుంబ తగాదాలతోనే ఈ ఘటన జరిగిందని ప్రాధమికంగా వెల్లడైంది. జార్జియాలోని లార్సెన్‌విల్లే నగరంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ దారుణం జరిగింది. 51 సంవత్సరాల విజయ్‌కుమార్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో కుమార్ భార్య మీమూ దోగ్రా (43 సంవత్సరాలు) బంధువులు గౌరవ్ కుమార్ (33), నిధి చందర్ 37, హరీష్ చందర్ 38 మృతి చెందారు. కుటుంబ గొడవ ముదిరిన దశలో విజయ్‌కుమార్ బంధువుల నివాసంలోనే వీరిపై అతి దగ్గరి నుంచే కాల్పులకు దిగినట్లు గ్వినెట్ కౌంటీ పోలీసు వర్గాలు తెలిపాయి. విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంట్లో గొడవ కాల్పుల సమయంలో ముగ్గురు పిల్లలు భయపడి ఇంట్లోనే ఓ రూంలో బిక్కుబిక్కు మంటూ తలుపులు పెట్టుకుని ఉన్నారు. కాల్పుల గురించి వీరు ఫోన్ చేసి చెప్పడంతో పోలీసు వర్గాలు అక్కడికి వచ్చినట్లు , లోపల మృతదేహాలను గమనించినట్లు వెల్లడైంది. కుమార్ కుటుంబం అట్లాంటాలో ఉంటోంది.
ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ కావడంతో వారు తమ 12 ఏండ్ల బాబును తీసుకుని గ్విన్వెట్ కౌంటీని బ్రూక్ ఐవి కోర్టు ప్రాంతంలోని బందువుల ఇంటికి వచ్చారు. ఇక్కడనే కాల్పుల ఘటన జరిగింది. వెంటనే పిల్లలు స్థానిక 911కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నలుగురిని చంపివేసిన తరువాత విజయ్ కుమార్ ఇంటి వెనుక వైపు ఉన్న అడవి గుండా పారిపోయాడు. ఫోన్ , సాంకేతిక సిగ్నల్స్ సాయంతో విజయ్ ఆచూకిని కనుక్కుని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. దంపతులు తరచూ ఘర్షణ పడుతుంటారు. అయితే ఈసారి ఏ విషయంపై తగాదా ఏర్పడిందనేది తెలియదు. పైగా బంధువుల ఇంటికి ఈ కుటుంబం ఎందుకు వచ్చిందనేది కూడా నిర్థారణ కాలేదు. విజయ్‌పై హత్య కేసు, పిల్లలపై క్రూరత్వం ఇతర తీవ్రస్థాయి కేసులు నమోదు చేశారు. ఘటన తరువాత ఇక్కడికి వచ్చిన పోలీసులు లోపలి గదిలో క్లోజెట్‌లో లాక్ చేసుకుని ఉన్నట్లు గుర్తించారు. వీరిని వెలికితీసిన పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.
భయంతో తల్లడిల్లిన కొడుకు..పిల్లల ఫోన్‌కాల్‌తోనే దారుణం వెలుగులోకి
తల్లిదండ్రుల మధ్య ఘర్షణలు, రాజీపడని తత్వం పిల్లలను తల్లడిల్లేలా చేస్తుందనే నిజం అమెరికాలో జరిగిన ఎన్నారై కాల్పుల ఘటనతో తేటతెల్లం అయింది. ఇంట్లో పెద్ద వారంతా గొడవలకు దిగుతూ ఉండటం, మధ్యలోనే అందుబాటులో ఉన్న గన్‌తో తండ్రి విజయ్ కాల్పులకు దిగడంతో ఆయన కొడుకు భయంతో తల్లడిల్లాడు. ఈ లోగా ఇంట్లోని ఇతర పిల్లలు చాకచక్యంతో వ్యవహరించడంతో అంతా కలిసి పక్కరూంలోకి వెళ్లారు. ఈ లోగానే ముందుగా కొడుకును చంపేందుకు చాలా సేపటి వరకూ విజయ్ యత్నించినట్లు ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డ బాబుతో తెలిసింది. లోపల ఉన్న వారిని కూడా చంపేందుకు విజయ్ యత్నించినట్లు వారు భద్రంగా లోపల దాక్కుని ఉండటంతో పారిపోయినట్లు తరువాత పోలీసు వర్గాలు పిల్లలను సముదాయించి విచారించిన క్రమంలో వెల్లడైంది.