Reading Time: < 1 minute

ఎఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా

మన తెలంగాణ / హైదరాబాద్ : యువతను మోసం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమిద్దామని అఖిల భారత యువజన సమాఖ్య(ఎఐవైఎఫ్) జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా పిలుపునిచ్చారు. ఎఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశం శనివారం హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రోషన్ కుమార్ ముఖ్య నేతగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ప్రమాధకరమని, దేశాన్ని 100 సంవత్సరాలు వెనక్కి నెట్టేలా ఆర్‌ఎస్‌ఎస్ విధానాలతో పాలించడానికి నీచ కుటిల రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. ఈ విధానాలను దేశ యువత, పౌరులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశ పౌరులకు అందించాల్సిన సంక్షేమ ఫలాలు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

మోడీ అంటే కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేసి ఊడిగం చేసే ప్రధాని అని, ప్రధాని బాధ్యతను సైతం దుర్వినియోగం చేసే చరిత్రహీనుడని ధ్వజమెత్తారు. మోడీ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని బలవంతంగా దేశంలో మత ఉన్మాదం అనే కాషాయ విష బీజాలను విద్యార్థులు, యువత మెదళ్లలో చొప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విధానాలను దేశ యువత అంగీకరించడానికి సిద్ధంగా లేరని అన్నారు. అందుకే ఎఐవైఎఫ్ పోరాటాలను ఉదృతం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ టి.సత్య ప్రసాద్,కొండల్ చేపూరి,బిజ్జ శ్రీనివాసులు, పేరబోయిన మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. బాలక్రిష్ణ, సల్మాన్ బేగ్, ఎండి. కుతూబ్, పి. శివ కుమార్, రాజ్ కుమార్, రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమూద్, శ్రీకాంత్, ఆంజనేయులు, కళ్యాణ్, శేఖర్, వెంకటేష్, భగత్ సింగ్, మధుకర్, మహేష్, అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.